Land Encroachment: స్వేచ్చ బ్యూరో: అశ్వారావుపేటలో మరోసారి ప్రభుత్వ భూముల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 108లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అక్రమంగా విక్రయించబడినట్లు ప్రచారం సాగుతుండటం పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టణానికి చెందిన ఓ ఆగర్భ శ్రీమంతుడు తన ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్న సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని నారవారిగూడెంకు చెందిన వ్యక్తులకు ఎకరానికి రూ.50 లక్షలకు పైగా విక్రయించినట్లు సమాచారం ఉంది. గుర్రాల చెరువు రహదారికి ఆనుకుని, మున్సిపాలిటీ పరిధిలో అత్యంత అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో ఈ భూమి ఉండటం గమనార్హం. రహదారి సౌకర్యం, పట్టణానికి సమీపం, భవిష్యత్తులో వాణిజ్య ప్రాధాన్యత పెరిగే అవకాశాల నేపథ్యంలో ఈ భూముల విలువ కోట్ల రూపాయలకు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, సదరు వ్యక్తి గతంలో దొంతికుంట చెరువు శిఖం భూములను ఆక్రమించి తప్పుడు పత్రాలతో విక్రయాలు జరిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రాకముందే చల్లారిపోయిందని, ఇప్పుడు అదే తరహాలో మరోసారి ప్రభుత్వ భూములపై కన్నేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సమాచారం ప్రకారం, తన ఫామ్ హౌస్‌కు వెళ్లేందుకు అవసరమైన దారి కోసం ఎకరం వరకు భూమిని మాత్రమే తన వద్ద ఉంచుకొని, మిగతా భూమిని దశలవారీగా విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
Also Read: అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!
భూమిని కొనుగోలు చేసిన వారు ఇప్పటికే బోరు తవ్వించి, విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో భూమి విక్రయం జరిగిన విషయం బహిర్గతమై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడింది. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, విద్యాసంస్థలు, క్రీడా మైదానాలు, ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములు అత్యవసరంగా మారనున్నాయి. ఇప్పటికే పట్టణంలోని పలు గురుకుల పాఠశాలలు ఇరుకైన ప్రదేశాల్లో, ఆటస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న అలాంటి పరిస్థితుల్లో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు, విక్రయాల ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ శాఖ వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 108లోని భూముల యాజమాన్యంపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూములైతే వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూమిని విక్రయించే అధికారం ఎవరు ఇచ్చారు? కోట్ల విలువైన భూములు చేతులు మారుతున్నా రెవెన్యూ శాఖకు తెలియలేదా? భూమి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? కొనుగోలుదారులకు హక్కులు ఎవరు కల్పించారు..? ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ఎవరిదన్నది ఇప్పుడు సంచనంగా మారింది. అశ్వారావుపేటలో ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వాస్తవాలు వెలికితీయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.