
Amit Shah latest news(TS politics):
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలకు తెలియాలని అమిత్ షా అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలను సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ వంచారని గుర్తు చేశారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారన్నారు. పటేల్ లేకపోతే తెలంగాణకు త్వరగా విముక్తి లభించేది కాదన్నారు.
అలాగే ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని వివరించారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావులకు నివాళులర్పించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహించలేదని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించారు.