జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉందన్నారు. భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలను గుర్తు చేశారు. అమరవీరులను స్మరించారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురం భీం, రావి నారాయణరెడ్డి లాంటి వీరయోధులకు నివాళులర్పించారు.
తెలంగాణ నేలపై అనేక పోరాటాలు జరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి గుండెలు ఎదురొడ్డి వీరులు పోరాటం చేశారని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడం అవకాశం తనకే దక్కిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యతను తనకే అప్పగించారని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ అన్నారు. 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని స్పష్టం చేశారు. ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ గా ఉందన్నారు.తెలంగాణ ఆచరిస్తోంది- దేశం అనుసరిస్తోంది అనే మాట అక్షర సత్యమన్నారు.