Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ మొత్తం వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కోంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం రోజు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అదే విధంగా హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని తెలిపారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం..
ఇటు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణశాఖ అధికారులు.
ఏపీకి మరో నాలుగు రోజులు వాయుగుండం ముప్పు..
ఏపీకి నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనుండగా, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు.
గుంటూరులో దంచికొట్టిన వర్షం
గుంటూరులో భారీ వర్షం దంచికొట్టింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలలోకి భారీ వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడా రోడ్లపైకి మోకాళ్లకు పైగా వర్షపు నీరు నిలిచింది. దీంతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడళ్లలో వరద నీటి కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
భారీ వర్షాల కారణంగా పొంగి పోర్లుతున్న మురుగునీరు..
కుంభవృష్టికి గుంటూరులో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కాలువలు పొంగిపొర్లడంతో మురుగునీరు, వాననీరు రోడ్లపైకి చేరింది. దీంతో బ్రాడీపేట్, అరండల్ పేట్, శ్రీనగర్, బొంగరలాబీడు వంటి వాణిజ్య, నివాస ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. అనేక చోట్ల వాహనాలు మోకాళ్ల లోతు నీటిలో చిక్కుకుపోయాయి. ముఖ్యంగా కంకరగుంట రోడ్ అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.