Warangal Gang War: వరంగల్ జిల్లాలో గ్యాంగ్ వార్‌కు సిద్ధమైన రౌడీ షీటర్లు. ముందుగానే గుర్తించి చెక్ పెట్టారు పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన కరడుగట్టిన రౌడీ షీటర్ సురేందర్ తన స్నేహితుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు.. ఆయుధాలతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టి.. సురేందర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 5న ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో బాసిత్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అతనికి సురేందర్ ఆత్మీయ స్నేహితుడు. బాసిత్‌ను హత్య చేసిన వారిని మర్డర్ టు మర్డర్ చేయాలని.. నిర్ణయించుకున్నట్లు విచారణలో బయటపడింది. దానికి అనుగుణంగా వరంగల్ జిల్లాలో రెక్కీ నిర్వహిస్తూ, గ్యాంగ్‌తో కలిసి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు.
సురేందర్ దాదాపు నెల రోజులుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో.. తన గ్యాంగ్‌తో తిరుగుతూ సామాన్యులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇటీవల అక్టోబర్ 18న మందారిపేట సెంటర్ వద్ద, సురేందర్ గ్యాంగ్ లారీ డ్రైవర్‌ను ఆపి, కత్తులు చూపించి డబ్బులు లాక్కెళ్లారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో సురేందర్ పేరు బయటపడింది. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి అతడిని కదలికలను గుర్తించారు.
ముందస్తు సమాచారం ప్రకారం.. ఓరుగల్లు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టారు. వరంగల్ నగర పరిధిలోని ఆటోనగర్ ప్రాంతంలో దాగి ఉన్న సురేందర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక కత్తి, మూడు మొబైల్ ఫోన్లు, వసూలు చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
సురేందర్‌ను ప్రశ్నిస్తున్న టాస్క్ ఫోర్స్ అధికారులు.. అనేక సంచలన వివరాలు బయటపెట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సురేందర్‌పై దాదాపు 15 హత్య కేసులు, రేప్, ఎక్స్టార్షన్, దోపిడీ వంటి నేరాలు ఉన్నట్లు తేలింది. అంతేకాదు, అతనిపై రాచకొండ సీపీ ఇప్పటికే నగరబహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కూడా అతడు వరంగల్‌ను అడ్డాగా చేసుకుని తన నేరాలను కొనసాగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
టాస్క్ ఫోర్స్ సమాచారం మేరకు సురేందర్ గ్యాంగ్, బాసిత్ హత్యలో నిందితుల గ్యాంగ్‌ల మధ్య.. పెద్ద ఎత్తున గ్యాంగ్ వార్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని రక్తపాతం జరగకుండా నివారించారు.
Also Read: జోగి రమేష్ అరెస్టుపై జగన్ రియాక్ట్, రేపో మాపో మరికొందరు నేతలు అరెస్టయ్యే ఛాన్స్?
సురేందర్, అతడి గ్యాంగ్ సభ్యులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. గ్యాంగ్‌లో భాగమైన మిగతా సభ్యుల కోసం పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు. టెలికమ్యూనికేషన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గ్యాంగ్ కదలికలను విశ్లేషిస్తున్నారు.