తెలంగాణ జన సమితి నాలుగు ప్లీనరీకి రెడీ అయ్యింది. వచ్చే నెల 9న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఈ ప్లీనరీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో మిత్రపక్షంగానే ఉంటూ.. పలు ప్రజాందోళన కార్యక్రమాలను కూడా నిర్మించాలనే యోచనలో కోదండరామ్ టీమ్ ఉందని తెలిసింది.
ఇటీవల జరిగిన పార్టీ స్టేట్ కమిటీ మీటింగులు కీలక నేతలంగా కోదండరామ్ పై ఒత్తిడి పెంచారు. జాబ్ క్యాలెండర్, ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణ, ఉద్యమకారుల సంక్షేమం, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర కీలక అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
ఈ మేరకు కోదండరామ్‌పై కూడా జన సమితి నేతలు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. రెండేళ్ల పాటు సైలెంట్‌గానే అన్నీ చూస్తూ వస్తున్నా.. ఇక కొన్ని అంశాలపై తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల నిర్వహణ ద్వారా ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావాలని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మెజారిటీ సభ్యులంతా ఇదే విషయాన్నికోదండరామ్ దృష్టికి తీసుకుపోయారు.
దీంతో అధ్యక్షుడు కూడా ఓ నిశ్చితాభిప్రాయానికి రావడంతో తీర్మానం రెడీ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కూడా ఆందోళనబాట పట్టాలని కూడా జన సమితి నేతలు క్లారిటీగా ఉన్నారు. మిత్ర పక్షమైన సర్కార్‌కు కొంత సమయం ఇవ్వాలనే యోచనలో ఇంత కాలం వేచి చూసే దోరణిని అవలంభించినా… ఇప్పటి వరకు సర్కార్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, హామీల అమలు విధానంపై జన సమితి నేతలు పెదవి విరుస్తున్నారు. దీంతో ఈ నాలుగో ప్లీనరీ వేదికగా స్పష్టమైన ఓ రాజకీయ విధానాన్ని ప్రకటించి ఆ దిశగా ముందుకు పోవాలని ఓ స్థిర అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక ఏడాది మాత్రమే ప్రజాస్వామికంగా ఉండి.. ఆ తరువాత సీమాంధ్ర పాలకుల మాదిరిగానే ఈ సర్కార్ కూడా నడుస్తున్నదనే అభిప్రాయాన్ని స్టేట్ కమిటీ మీటింగులో పలువురు వ్యక్తపరిచారు. ఉద్యమకారులకు పెద్ద దిక్కుగా ఉన్న కోదండరామ్ సూచనలను కూడా సర్కార పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆ వర్గం నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని వారు భావిస్తున్నారు.
ఈక్రమంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మిత్రపక్షంగా పలు సూచనలు చేస్తూనే… ప్రజాందోళనలు, నిరసనలు తెలియడం ద్వారా సర్కార్‌పై కూడా ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరించుకోవాలని జన సమితి నేతలు భావిస్తునన్నారు. హామీల పరిష్కారం కోసం నిరంతర పోరాటమే శరణ్యమని డిసైడ్ కావడం…దీనికి ప్లీనరీని వేదికగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.