Municipal Corruption: హైదరాబాద్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి బట్టబయలైంది. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులతో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగానికి అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జరిపిన లోతైన విచారణలో కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. ప్రధానంగా డిప్యూటీ కమిషనర్ సరస్వతి నేతృత్వంలో సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పనులు పూర్తి చేయకుండానే తప్పుడు లెక్కలు చూపి, నిధులు దారి మళ్లించిన వైనం అధికారులను విస్మయానికి గురిచేసింది.
చేయని పనులకు కాగితాలపైనే బిల్లులు
ఈ కుంభకోణంలో ప్రధానంగా అస్తిత్వంలో లేని పనులు కీలక పాత్ర పోషించాయి. క్షేత్రస్థాయిలో ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించకుండానే, రికార్డుల్లో మాత్రం పనులు పూర్తయినట్లు చూపి కోట్లాది రూపాయల బిల్లులను డ్రా చేసుకున్నట్లు తేలింది. మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనమైన క్రమంలో ఏర్పడిన గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని, అక్రమ మార్గాల్లో ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు విచారణాధికారులు గుర్తించారు. కేవలం విజిలెన్స్ మాత్రమే కాకుండా, ఏసీబీ (ACB), రాష్ట్ర విజిలెన్స్ విభాగాలు కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాయి.
ఇన్ఫ్లుయెన్స్‌తో మళ్లీ అదే స్థానానికి..
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరస్వతి గతంలో ఇక్కడ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పరిపాలనాపరమైన మార్పుల్లో భాగంగా ఆమె బదిలీ అయినప్పటికీ, తనకున్న రాజకీయ, ఇతర ప్రభావాలను ఉపయోగించుకుని తిరిగి బడంగ్‌పేటకే డిప్యూటీ కమిషనర్‌గా రావడం గమనార్హం. తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే భారీ ఎత్తున బిల్లులు పెడుతుండటంతో అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ వరుస పరిణామాలు ఆమె అవినీతి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశాయి.
పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు
విజిలెన్స్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ కఠిన చర్యలు చేపట్టారు. నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా, విధుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం వహించినందుకు గాను డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు మరో తొమ్మిది మంది అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 10 మంది అధికారులు ఈ స్కామ్‌లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. ప్రజాధనాన్ని కాజేయడంలో భాగస్వాములైన ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని యంత్రాంగం స్పష్టం చేసింది.
Also Read: కల్తీ వ్యాపారం చేయొద్దు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే, కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్
తదుపరి చర్యలకు రంగం సిద్ధం
ఈ భారీ స్కామ్ కేవలం సస్పెన్షన్లతో ఆగిపోయేలా కనిపించడం లేదు. విజిలెన్స్ నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. మళ్లించిన నిధులను ఎలా రికవరీ చేయాలి? దీని వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ ఘటనతో మున్సిపల్ శాఖలో ప్రక్షాళన అనివార్యమని స్పష్టమవుతోంది.