హైదరాబాద్ నగర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ స్వలాభం కోసం ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కల్తీ చేయడం అంటే కేవలం లాభాల కోసం చేసే వ్యాపారం కాదని.. అది యావత్ సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ‘హెచ్-ఫాస్ట్’ (H-FAST) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నగరంలో ఆహార భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని సీపీ ఈ సందర్భంగా వ్యాపారులను హెచ్చరించారు. గత నెల రోజుల వ్యవధిలో పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల వివరాలను ఆయన వెల్లడించారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 92 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ దాడుల్లో సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్న 98 మంది నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపినట్లు పేర్కొన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..
ఆహార పదార్థాల విక్రయదారులు కేవలం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకోకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సీపీ హితవు పలికారు. నాణ్యత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ రహిత సమాజం కోసం ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పేరు ప్రతిష్టలను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..
ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని సీపీ ఆదేశించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి పోలీసు శాఖ అలాగే ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
వ్యాపారుల సానుకూల స్పందన
ఈ సదస్సుకు మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి వంటి వివిధ విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను వ్యాపారులు సీపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సానుకూలంగా విన్న కమిషనర్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కల్తీని అరికట్టేందుకు పోలీసు శాఖ తీసుకుంటున్న చొరవను వ్యాపారులు అభినందించారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
ALSO READ: అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న తెలంగాణ వెదురు సంపద