Big Stories

Bandi sanjay : జైలు నుంచి బండి సంజయ్ విడుదల.. కేసీఆర్ కుటుంబంపై ఫైర్..

Bandi sanjay : టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బెయిల్ రావడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. బయటకు వచ్చాక తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఎంపీగా ఉన్న తనపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోస్టులు, పైసలు కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

సీపీపై విమర్శలు..
వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సీపీ చెప్పేవన్నీ అవాస్తవాలే అన్నారు. పేపర్ లీకేజీతో సంబంధంలేదని తన పిల్లలపై ప్రమాణం చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. సీపీ చెప్పింది నిజమైతే తన టోపిపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్‌ చేశారు? అని నిలదీశారు. TSPSC ఇష్యూను డైవర్ట్‌ చేయడానికి ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. పరీక్ష కేంద్రంలో పేపర్ ఫోటోలు తీస్తుంటే.. పోలీసులు, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఫోన్లు లోపలికి ఎలా తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారో? దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా తనను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. వాట్సాప్‌లో ఎవరో పేపర్‌ షేర్‌ చేస్తే తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు. సీపీకి లీకుకు, మాల్‌ ప్రాక్టీస్‌కు తేడా తెలియదా? నిలదీశారు.

- Advertisement -

కేసీఆర్ కుటుంబంపై ఫైర్..
సీఎం కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. TSPSC పరీక్షలు రాసిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. పేపర్ లీకులతో నష్టపోయిన టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులతో వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.

ఆ ఇద్దరూ జైలుకు వెళ్లడం ఖాయం..
కేసీఆర్‌ అడ్డగోలుగా డబ్బు సంపాదించారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ గురించి సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కవిత జైలుకెళ్లడం ఖాయమన్నారు. తర్వాత కేటీఆర్ ను రెడీ చేస్తున్నామని వెల్లడించారు.కేసీఆర్‌ కుటుంబం నియంత పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని అన్నారు. నయా నిజాం కేసీఆర్‌ను తరిమికొడతామన్నారు. మంత్రి హరీష్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే హరీష్‌రావునే ముందుగా పార్టీ నుంచి జంప్‌ అవుతారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ అగ్ర నేతలు ఫోన్స్‌ చేశారని తెలుస్తోంది. కేంద్రహోం మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌ మాట్లాడారని సమాచారం. కేంద్రం, బీజేపీ నాయకత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని సంజయ్‌కు సూచించారని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News