Bandi Sanjay: “హిందుత్వమే నా శ్వాస.. నా నోటి నుండి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లే” అంటూ హుజూరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానానికి, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ‘హిందుత్వమే’ మూలమని ఆయన స్పష్టం చేశారు. . గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్ల నుంచి 48 సీట్లకు ఎదగడం వెనుక కేవలం హిందుత్వ ఎజెండానే ఉందని, తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించే వరకు ఇదే పంథాలో గడపగడపకూ వెళ్తానని ఆయన ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఓటింగ్ సరళిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా, ముస్లింలకు, క్రిస్టియన్లకు కూడా సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ, వారు బీజేపీకి ఓటు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మసీదుల్లో ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారని ఆరోపించారు. “కేవలం 12 శాతం ఉన్న ముస్లింలు ఒక్కటైతే తప్పులేనప్పుడు, 80 శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తప్పేముంది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. హిందువులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
రానున్న సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా రాదని హెచ్చరించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాగుతోందని, ఆ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని విమర్శించారు. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీ మద్దతుదారులనే గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విఫలమైందంటూ ‘కాషాయ సమరభేరీ’కి శ్రీకారం చుట్టారు. ఈ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. నిరసనలో భాగంగా ఈ నెల 26న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారీ ‘సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Read Also: Chikoti Praveen: దేవుడి పేరుతో సినిమాలు.. రాజమౌళిపై బీజేపీ నేత ఫైర్