BC Census: స్వేచ్ఛ బ్యూరో: జనగణనలో కులగణన చేస్తామని బీజేపీ మాటతప్పిందనిమాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. న్యూ ఢిల్లీలోని జవహర్ భవన్ లో నిర్వహించిన ఓబీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి, ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కులగణన అత్యంత కీలకమని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం కులగణన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బీసీ కులగణనకు అవసరమైన విధానాన్ని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ కులాలకు కూడా ప్రత్యేక కోడ్‌లు కేటాయించి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ కులాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారో గుర్తించి సమగ్ర జాబితా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ధోబి–రజక, నాయీ బ్రాహ్మణ–మంగలి, గౌడ్–ఈడిగ, శ్రీశైన–నాడార్, ముదిరాజు, ఫిషర్‌మెన్ వంటి కులాలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఉన్నందున కేవలం పేరును అడిగి నమోదు చేస్తే స్పెల్లింగ్, ఉచ్చారణలో వచ్చే చిన్నపాటి తేడాలతోనే కులం మారిపోయే ప్రమాదం ఉందన్నారు.2011లో కులగణన చేపట్టినప్పుడు కులాల పేర్లను శాస్త్రీయంగా వర్గీకరించకపోవడంతో లక్షలాది కులాలు ఉన్నట్లు నమోదు చేశారన్నారు. బ్రిటిష్ పాలనలో 1931లో కులగణన నిర్వహించినప్పుడు సుమారు 4,300 కులాలుగా నమోదైన పరిస్థితితో పోలిస్తే, సరైన కుల జాబితా, కోడ్ వ్యవస్థ లేకుండా సర్వే నిర్వహిస్తే అనేక రకాల పేర్లు నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Also read: తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ
రాష్ట్రాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల జాబితాలను రూపొందించిన విధంగానే, దేశవ్యాప్తంగా ఓబీసీ కులాల సమగ్ర జాబితాను తయారు చేసి ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఇవ్వాలని కోరారు. అప్పుడే వృత్తి ఆధారిత కులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే బీసీ కులగణన పేరుతో మోసం చేసినట్లవుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రకటించిన “జిత్నీ ఆబాదీ ఉత్నా హిస్సా” నినాదం అమలు కావాలంటే ముందుగా దేశంలో బీసీల జనాభా ఎంతుందో కచ్చితంగా లెక్కించాల్సిందేనన్నారు. కులగణనపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా ప్రశ్నించడంతో పాటు జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనలకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు.అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై కూడా బీసీ కులగణన విషయంలో బాధ్యత ఉందన్నారు.మహిళా రిజర్వేషన్ల విషయంలో కూడా బీసీ మహిళలకు న్యాయం జరగాలంటే బీసీ జనాభా లెక్కలు, ప్రాతినిధ్యం స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలకు తగిన వాటా కల్పించాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా బీసీ నాయకులు, మేధావులు, సామాజిక సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు కాస్ట్ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. లక్షలాది మందితో ఆందోళనలు నిర్వహించి, ఎంపీలను, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి బీసీ కులగణనలో శాస్త్రీయ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఒకే కులం ఒక రాష్ట్రంలో ఓసీగా, మరో రాష్ట్రంలో బీసీగా, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీగా ఉండే పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రాల వారీగా ఉన్న వర్గీకరణను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా కులాల సమగ్ర జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జనగణన లో ఒక బీసీ కాలమ్ ను ఏర్పాటు చేసి, శాస్త్రీయమైన కోడ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు.దేశవ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసి, కార్యాచరణ చేపట్టి దేశ వ్యాప్త ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ అనిల్ జైహింద్, సూరజ్ మండల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డా. కిరణ్ కుమార్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వీజీఆర్ నారగోని తదితరులు పాల్గొన్నారు.
Also read: రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !