Robotic Surgery: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని పేద ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ‘స్టేట్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్’ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్‌మెంట్, ఆధునిక సదుపాయాలను మంత్రి పరిశీలించారు. అనంతరం వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలు, వాటి వినియోగంపై నిపుణులతో సమగ్రంగా చర్చించారు.
తర్వాత జరిగిన సభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని ప్రధాన బోధనాసుపత్రులు, ఉమ్మడి జిల్లాల జీజీహెచ్‌లలో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో అతి తక్కువ కాలంలోనే వెయ్యి రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసి రికార్డు సృష్టించామని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, టీమ్స్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు ఉమ్మడి జిల్లాల జీజీహెచ్‌లలో ఈ సేవలను విస్తరిస్తామన్నారు. మన దేశ రోబోటిక్ సర్జరీ పితామహుడు డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ సేవలనుతెలంగాణలో వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.
Also read: ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 90 శాతం వరకు ఉచితంగా సర్జరీలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణను ‘అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సర్వీస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫార్మా, వైద్య రంగాల్లో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా నూతనంగా టీమ్స్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణాలు చేపడుతున్నామని, ఇవి పూర్తయితే రాష్ట్రంలో అదనంగా 40 వేలకు పైగా బెడ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టీమ్స్ ఆస్పత్రిలో విదేశీ రోగుల కోసం 100 ప్రత్యేక బెడ్లను కేటాయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో క్యాన్సర్ కేర్, ట్రమా కేర్ పాలసీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ప్రస్తుతం ఉన్న 102 డయాలసిస్ కేంద్రాలకు అదనంగా మరో 79 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తూ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ వాణి, టీమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బీరప్ప, డాక్టర్ విమల థామస్, డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ, డాక్టర్ రాజ్ గజ్భియే తదితరులు పాల్గొన్నారు.
Also read: బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్ జోన్‌లో ఆ రెండు కులాలు..?