Bhadrachalam vs Ayodhya: అయోధ్య రామాలయం తరహాలో భద్రాచలం అభివృద్ధి జరగడం లేదనే చర్చ ఎంతో కాలంగా సాగుతూనే ఉంది. శుక్రవారం శ్రీరామనవమి కావడం, భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరగడంతో మరోమారు ఈ ఆలయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి సంబంధించి సహజంగానే చర్చ మెుదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాలు.. కేంద్రంతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలపై విరుచుకుపడుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో గల రామాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసి.. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలాన్ని కేంద్రం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘రాముడికి ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఉంటుందా మోదీ?’ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాయి. ‘దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తారని తెలుసుగానీ, దక్షిణాది గుళ్లపై కూడా వివక్షేనా?’ అంటూ నిలదీస్తున్నాయి.
రాముడికి ఉత్తరాది, దక్షిణాది అని తేడా ఉంటుందా మోడీ?
దక్షిణ రాష్ట్రాలపై వివక్ష చూపిస్తవని తెలుసు కానీ దక్షిణాదిలోని గుళ్లపై కూడా వివక్షేనా? https://t.co/isLTTee3t8 pic.twitter.com/JaKUuUswxK— Telangana Galam (@TelanganaGalam_) March 27, 2026
ప్రస్తుతం తెలంగాణలో 8 చొప్పున బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా శుక్రవారం భద్రాచలం ఆలయాన్ని సందర్శించలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాముడి పేరుతో ఓట్ల రాజకీయం చేసే ఈ నేతలు.. రాముడి పండుగకు మాత్రం దూరంగా ఉండిపోయారని నిలదీస్తున్నాయి. ఎన్నికలు ఉంటేనే రాముడు మీకు గుర్తుకు వస్తారా? అంటూ అధికార పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. బీజేపీ ప్రతినిధుల ఫొటోల ఉన్న పోస్టర్లను నెట్టింట వైరల్ చేస్తున్నాయి.
అయోధ్య రామాలయం నిర్మాణం ఒక ట్రస్ట్ (శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర) ద్వారా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారీ స్థాయిలో జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిచ్చింది. మరోవైపు భద్రాచలం విషయంలో కేంద్రం PRASHAD (Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive) పథకం కింద నిధులను కేటాయించింది. కేంద్ర పర్యాటక శాఖ భద్రాచలంలో పర్యాటక మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.41.38 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే, అయోధ్య తరహాలో రూ.వేల కోట్ల ప్రాజెక్టుగా దీనిని కేంద్రం చేపట్టలేదనే విమర్శలు మాత్రం చాలా కాలంగా ఉన్నాయి. కేంద్రం నుండి మరింత భారీ ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.
భద్రాచలం అభివృద్ధి ఆలస్యం కావడానికి ప్రధానంగా రెండు రాజకీయ, పాలనపరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. దీనివల్ల ఆలయానికి ఉన్న భూములు (సుమారు 900 ఎకరాలకు పైగా) ఏపీ పరిధిలోకి వెళ్లాయి. ఈ భూముల యాజమాన్యం ఆదాయంపై రెండు రాష్ట్రాల మధ్య స్పష్టత లేకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మారింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం (BRS) రూ.100 కోట్లు ప్రకటించినా అవి పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదు. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారంలో ఉండటం వల్ల నిధుల కేటాయింపులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read: Bandi Sanjay: రేవంత్‌తో కేసీఆర్ కుమ్మక్కు.. కవిత కొత్త పార్టీపై.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే భద్రాచలం ఆలయ పునర్నిర్మాణం, పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి దశ అభివృద్ధి పనుల కోసం రూ.351 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు దశల్లో జరిగే ఈ మొత్తం ప్రాజెక్టుకు దాదాపు రూ.586 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మొదటి దశలో ఆలయ విస్తరణ, గోదావరి ఘాట్ల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు ఉండనున్నాయి. తదుపరి దశలో పట్టణ సుందరీకరణ, రవాణా సౌకర్యాల మెరుగుదల చేస్తారు.