Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా క్రికెట్ ఆడారు. పాఠశాల విద్యార్థులతో చేతులు కలిపి పాదయాత్ర కొనసాగించారు. నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు సంప్రదాయ వేషధారణలో రాహుల్‌కు స్వాగతం పలికారు. రాహుల్ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. దివ్యాంగులకు రాహుల్ చేతుల మీదుగా వీల్‌ఛైర్లను అందజేశారు. రామ్‌మందిరం సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబంపై ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను రాహుల్ తిలకించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.