Bharat Summit 2.0: దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ‘భారత్ సమ్మిట్ 2.0’ కార్యక్రమంలో వారు వేర్వేరుగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.
తొలుత టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమారు గౌడ్ మాట్లాడతూ.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఫాసిస్ట్ పాలన నడుస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడటం, వీసాలను రద్దు చేయడం అత్యంత దారుణమన్నారు.
మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కు గురవడం మరింత బాధాకరణని టీపీసీసీ చీఫ్ అన్నారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడి ఫోన్ నే ట్యాప్ చేశారంటే.. పాలన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చన్నారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీదని ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అటు బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందో కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి ఎలా చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
Also Read: ‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!
దేశానికి కాబోయే ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయనను రీ-లాంచ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదని వ్యాఖ్యానించారు. తాము రాసే తెలంగాణ చరిత్రలో సోనియా గాంధీ పేరు మొదటి పేజీలో ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: ఏపీలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. నేడు పెండింగ్ పురపాలికలు.. రేపు తొలి దశ పంచాయతీలకు నామినేషన్లు!