Bharat Summit – Rahul: హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ – 2’ రెండో రోజు మరింత సందడిగా మారనుంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత నేడు రాహుల్ గాంధీ ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఇందుకో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆయన నగారానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నోవాటెల్ హోటల్ లో బస ఏర్పాటు చేసింది. నేడు హెచ్ఐసీసీ (HICC) వేదికగా జరిగే సదస్సుతో పాటు పలు కీలక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ పాల్గొననున్నట్లు అధికారిక షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది.
తొలి రోజు తరహాలోనే ఇవాళ కూడా ఉదయం 9 గంటల నుంచే సమ్మిట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. భారత్ సమ్మిట్‌లో భాగంగా తొలుత లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు చెందిన వివిధ దేశాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అనంతరం ఉదయం 9:45 గంటలకు అమెరికా, ఐరోపా దేశాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయి అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పరంగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ సందర్భంగా రాహుల్, రేవంత్ వివరించనున్నారు.
అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాల అనంతరం ఉదయం 10:30 గంటలకు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్ వరకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జయభేరీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత – సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారభించనున్నారు. ఈ చట్టంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, డిజిటల్ సేవల కార్మికులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, ప్రమాద బీమా, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ చట్టబద్ధమవుతాయి
Also Read: రూ.4000 కోట్ల రామాయణం అవసరమా? ఏఐతో లక్షల్లో సినిమా తీయొచ్చు: వర్మ
గిగ్ వర్కర్ల స్కీమ్ ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హెచ్ఐసీసీ వేదికకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ‘భారత్ సమ్మిట్-2’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానశ్రయం చేరుకొని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.