AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ లో మరోమారు ఎన్నికల సందడి మెుదలైంది. ఇటీవలే మున్నిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలు ముగియగా.. పెండింగ్ స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోమారు సిద్ధమైంది. పెండింగ్ లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మెుదలుకానుంది. సోమవారం (నవంబర్ 16) మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎవరూ అడ్డుకునే పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు పలు ప్రాంతాల్లో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైన చోట కలెక్టరేట్లలోనూ నామినేషన్లు స్వీకరించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా శ్రీకాకుళం మేయర్ అభ్యర్థుల నామినేషన్లను స్థానిక కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌లోనూ స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా బీ.కొత్తకోట, కందుకూరు, పొదిలి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కలెక్టరేట్లలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయంతో అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ నామినేషన్లు దాఖలు చేసే వెసులుబాటు కలిగింది.
మరోవైపు రేపు (నవంబర్ 15) తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మెుదలు కానుంది. 3,967 సర్పంచులు, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు గాను ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం (నవంబర్ 17) సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న వాటిని పరిశీలించి.. నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాటిని అధికారులు తిరస్కరిస్తారు. అయితే వాటిని తిరిగి అప్పీల్ చేసుకోనే వెసులుబాటు అభ్యర్థులకు కల్పించారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తర్వాత తుది జాబితా రిలీజ్ చేస్తారు. ఇక 26వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ఉండనుంది.