Batti with Nirmala : ఇటీవల ప్రకటించిన యూనియన్ బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ కేటాయించిన పాపాన పోలేదు. కానీ.. రాజకీయ అవసరాలు తీర్చుకునేందుకు మాత్రం కొన్ని రాష్ట్రాలకు అయాచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు. వివిధ అంశాలు, విభాగాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసిన భట్టి విక్రమార్క.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని త్వరగా అందించాలని కోరారు.
దిల్లీ పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క.. సఫ్దర్ జంగ్ రోడ్డులోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నివాసంలో ఆమెను కలిశారు. వివిధ అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన ఆర్థిక వనరుల గురించి చర్చించిన భట్టి విక్రమార్క.. వాటికి త్వరగా అందించాలని, రాష్ట్రానికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందజేసిన భట్టి.. ఇప్పటి వరకు స్పందించని విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
భట్టి విక్రమార్క నిధులు కోరిన ప్రాజెక్టులు..
1. వివిధ కార్పొరేషన్‌లు/ ఎస్పీవీ ల రుణ పునర్వ్యవస్థీకరణ (Restructuring of Debt) చేపట్టాల్సిందిగా కోరిన భట్టి విక్రమార్క.. ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
2. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 408 కోట్ల పైచిలుకు నిధుల గురించి చర్చించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి.. త్వరగా తిరిగి చెల్లింపులు చేయాలని కోరారు.
3. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 , కేటగిరి 94(2) ప్రకారం.. వెనుకబడిన జిల్లాల ప్రత్యేక సహాయ నిధిని త్వరగా విడుదల చేయాలని కోరారు.
4. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాట్లను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పొరబాటు కారణంగా తెలంగాణకు నష్టం కలుగుతుందని తెలిపారు.
5. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను విజ్ఞప్తి చేశారు.
6. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాద్యత (Excess Liability) మేరకు.. రాష్ట్ర సంస్థకు రావాల్సిన
నిధుల విషయమై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల్ని తెలంగాణ సంస్థకు త్వరగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. కేంద్రం చేయాల్సిన నిధుల బదిలీ (Transfer of Funds) గురించి చర్చించారు.
7. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
కాగా.. ఇటీవల బడ్జెట్ లో ఏపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన కేంద్రం.. తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కూడా విడుదల చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. సరిగా ఈ సమయంలోనే రాష్ట్ర మంత్రి.. కేంద్ర ఆర్థిక మంత్రితో భేటి కావడం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంపై స్పష్టమైన సమాచారంతో లేఖలు అందించడం ఆసక్తిగా మారింది.

Share