Bhavani Reddy: తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కేంద్రంగా మాటల యుద్ధం ముదురుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత భవానీ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట పర్యటనల విషయంలో హరీష్ రావు వైఖరిని తప్పుబడుతూ.. అధికార పార్టీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చి ప్రతిపక్షానికి పరిమితం చేసినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదని భవానీ రెడ్డి విమర్శించారు.
అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించం
ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రం మొత్తం తిరుగుతున్న హరీష్ రావు, అధికార పార్టీ నేతలు సిద్దిపేటకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని భవానీ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. సిద్దిపేట ఏమైనా హరీష్ రావు జాగీరా అని నిలదీసిన ఆమె, తాము బరాబర్ సిద్దిపేటకు వస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు.
బకాయిలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ప్రభుత్వంపై హరీష్ రావు చేస్తున్న విమర్శలకు భవానీ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు చదివిన బకాయిలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినవేనని ఆమె ఆరోపించారు. గత పాలకులు సిద్దిపేట రైతులను నట్టేట ముంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుందని తెలిపారు. సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన విషయాన్ని హరీష్ రావు ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడం మాని కాస్త తెలివి ప్రదర్శించాలని హితవు పలికారు.
సిద్దిపేటలో పోటీకి సిద్ధం
హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయం పట్టుకుందని భవానీ రెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు ముఖ్యమంత్రిని ఎందుకు కలవడం లేదని నిలదీశారు. సభకు నవ్వు వచ్చినా రాకపోయినా సభ ఆగదన్న ఆమె, రాబోయే రోజుల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేట నుంచైనా పోటీ చేసి హరీష్ రావును ఓడిస్తానని భవానీ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: హామీలు నెరవేర్చకుంటే ఉద్యమమే.. రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక