Sangareddy Land Scam: సంగారెడ్డి జిల్లాలో మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సామాన్యుల భూములైతే ఎవరికీ తెలియకుండా కొట్టేయొచ్చని అనుకున్న కేటుగాళ్లు, ఈసారి ఏకంగా ఒక విశ్రాంత డీజీపీ స్థాయి అధికారి భూమికే ఎసరు పెట్టారు. అక్రమార్కుల చేతివాటానికి మాజీ పోలీస్ బాస్ సైతం అవాక్కవ్వాల్సి వచ్చింది.
అసలేం జరిగింది?
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట గ్రామంలోని సర్వే నంబర్లలో విశ్రాంత డీజీ స్థాయి అధికారికి సుమారు రూ.18 కోట్ల విలువైన 4 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఈ భూమితో పాటు మరో రెవెన్యూ ఉద్యోగి భూమిపై కూడా కన్నేసిన కొందరు రియల్ ఎస్టేట్ కేటుగాళ్లు, అసలు యజమానులకు కనీస సమాచారం లేకుండానే భూ బదలాయింపు పూర్తి చేశారు. ఆ భూమిని ‘మీర్ మురద్ ఆలీ’ అనే వ్యక్తి పేరుపైకి మార్చేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన మాజీ డీజీపీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
రంగంలోకి సీఐడీ.. 15 మంది అదుపులోకి!
డీజీ హోదాలో రిటైర్ అయిన అధికారి కావడంతో.. తనకున్న పలుకుబడితో ఉన్నత స్థాయిలో విచారణకు ఆదేశించేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల సిద్దిపేట, రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాల్లో ధరణి భూ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులకు చిక్కిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఈ స్కామ్ వెనుక ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు నిందితులు ఇప్పటికే కంది జైలులో ఉండగా.. వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 15 మందిని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పరువు పోతుందని గోప్యత?
ఏకంగా పోలీస్ బాస్ స్థాయి అధికారి భూమే మాయం కావడంతో, ఈ విషయం బయటకు పొక్కితే శాఖ పరువు పోతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడ కేసు నమోదైంది అనే వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరా తీసినట్లు, ఇప్పటికే మీర్ మురద్ ఆలీ పేరుతో జరిగిన ఆన్‌లైన్ ట్రాన్జక్షన్‌ను సైతం డిలీట్ చేసినట్లు సమాచారం.
Also Read: అక్వాన్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు!