Chamala Kiran Kumar Reddy: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. నీతులు ఎదుటి వారికి చెప్పడం కాదు, ముందు మీ మామ కేసీఆర్ తిట్ల పురాణం, బూతులు ఒకసారి గుర్తు చేసుకోవాలని హరీష్ రావుకు చురకలు అంటించారు.
రాజకీయాల్లో అసలు సిసలైన తిట్ల పురాణాన్ని మొదలుపెట్టిందే కేసీఆర్ అని చామల విమర్శించారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడారని, బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు ఆయనకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగానే సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ఓడిపోయి ఫామ్ హౌస్ లో ఉండి, రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్.. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకుని “తోలు తీస్తాం” అంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. “మమ్మల్ని చెట్టుకు కట్టేయాలి.. లాగులో తొండలు వదలాలి” అని హరీష్ రావు మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. హరీష్ రావు ఇప్పుడు వేదాంతాలు, పాండిత్యం వల్లిస్తున్నారని, కేటీఆర్ కు ఐటీ, ఇరిగేషన్ తనకే తెలుసు అన్న అహంకారం ఉందని విమర్శించారు.
దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, నీళ్లు-నిజాలపై, గత పదేళ్లలో జరిగిన అవినీతి, అవకతవకలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసి మరీ 2023లో మిమ్మల్ని ఓడించారని, 2029 ఎన్నికల్లో మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి పంపించడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక సీఎం, మాజీ సీఎం పరస్పరం గౌరవించుకోవాలని బండి సంజయ్ ఇచ్చిన సలహాను ప్రస్తావిస్తూ.. “మేము చెప్పే అంశాలను ఆ దద్దమ్మలకు చెప్పాలని బండి సంజయ్ కు విజ్ఞప్తి చేస్తున్నా” అని ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులుగా హుందాగా వ్యవహరిస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
Read Also: BJP: పార్టీ కార్యాలయంలో పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నాయకులు