MP Chamala: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపుపై జరుగుతున్న చర్చలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పెంపు చేపడితే.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిధుల కేటాయింపులో వివక్ష ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ నిర్ణయం మరింత నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని చామల విమర్శించారు. ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, గతంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, కేంద్రం ఈ బిల్లు అమలును 2026 జనాభా లెక్కలతో ముడిపెట్టిందని, దానిపై ఇప్పుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 543 సీట్లకే మహిళా రిజర్వేషన్లు వర్తింపజేసినా తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని కూడా 50 శాతం ప్రాతిపదికగా తీసుకుని సీట్ల పెంపు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని తెలిపారు. పార్లమెంటులో బలం ఉందని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని, 850 సీట్ల పెంపుదలపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్లాలని, లేనిపక్షంలో దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం గళం ఎత్తుతామని స్పష్టం చేశారు.