Bhupalpally District: ఆ గ్రామంలో జరిగిన ఒక్క ఘటనతో ఊరే ఉలిక్కి పడింది. అంతటా ఆందోళన.. ఏ కీడు ఏ రూపంలో వస్తుందోనన్న భయం ఓ వైపు సాగుతుండగా, మరోవైపు అసలు తాము ఎటువంటి శాంతి పూజలు చేయాలంటూ వేదపండితులతో చర్చలు సాగిస్తున్నారు ఆ గ్రామస్థులు. ఇంతకు ఆ గ్రామం అంతలా భయపడేలా జరిగిన ఘటన ఏమిటో తెలుసుకుందాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబటిపల్లిలో శ్రీ అమరేశ్వరాలయం వెలసి ఉంది. ఈ ఆలయంలో భక్తులు నిరంతరం పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయంలో శ్రీ హనుమాన్ విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఉంది. ఇక్కడి స్వామి వారికి పూజలు నిర్వహిస్తే, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయం ఇక్కడ అంతా విశిష్టత కలిగి ఉంది.
అయితే గురువారం రాత్రి హనుమాన్ ఆలయం లోపలి నుండి ఒక్కసారిగా పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకొనే లోగా హనుమాన్ ఆలయం గర్భగుడి లోపల మంటలు స్థానికులకు కనిపించాయి. స్వామి వారి విగ్రహం పూర్తిగా మంటల్లో ఉండగా, స్థానికులు భయాందోళన చెందారు. ఈ ఘటనకు గల కారణాలను గ్రామస్థులు పలు రకాలుగా వెల్లడిస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా గ్రామస్థులు చర్చోపచర్చలు సాగిస్తున్నారు.
Also Read: MLC Kavitha: మోదీ టార్గెట్‌గా కవిత పోస్ట్.. బీఆర్ఎస్‌లో కొత్త జోష్
అలాగే గర్భగుడి లోపల దీపానికి గల మంటలు వ్యాపించి ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేయగా, వారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిన విషయం ప్రక్కన పెడితే.. గ్రామంలో మహిమలు గల ఆలయంలో విగ్రహం మంటల్లో కూరుకుపోయిన ఘటనతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. వేదపండితులను పిలిపించి గ్రామానికి కీడు జరిగే అవకాశం ఉందా? ఎటువంటి శాంతి పూజలు చేయాలని గ్రామస్థులు విచారిస్తున్నారు. ఏదిఏమైనా ఆలయంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.