Rain Alert: తెలంగాణకు మళ్లీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు ఆనుకొని తూర్పు విదర్భ ప్రాంతంలో మరో ఉపరితల అవర్తనం కొనసాగుతున్న కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు భారీ వర్షాల నేపథ్యంలో పొంచివున్న ముప్పు..
ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, ఇంటెన్స్ స్పెల్ కారణంగా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ జోరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు.. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
పగలు ఎండ.. రాత్రి వాన..
హైదరాబాద్‌లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండలు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వానలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్
ఇటు ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, రేపు రాయలసీమకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం..
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు.. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రైతులు పోలాల్లోకి వెళ్లినప్పుడు చెట్ల కింద నిలబడకూడదని వీలైనంత తొందరగా ఇంటికి చేరుకోవాలని చెబుతున్నారు.