Padi Kaushik Reddy : క్వారీ ఓనర్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇవ్వకుంటే చంపేస్తానని భయపెట్టాడు. బెదిరిపోయిన బాధితుడి భార్య పోలీసులకు కంప్లైంట్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. అరెస్ట్ చేస్తారని ఊహించిన పాడి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం రిలీఫ్ ఇవ్వకపోవడంతో.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసి హనుమకొండకు తీసుకెళ్లారు. రాత్రి వరకు పాడి ఎపిసోడ్‌లో పొలిటికల్ రచ్చ నడిచింది. అరెస్టు.. అడ్డుకోవడాలు.. వైద్య పరీక్షలు.. కోర్టు.. జైలు.. చివరాఖరికి అనూహ్య ట్విస్ట్‌తో కథ ముగిసింది.
14 రోజుల రిమాండ్.. చివర్లో..
క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఖాజీపేట కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయన్ను పటిష్ఠ భద్రత మధ్య ఖమ్మం జైలుకు తరలించాలనుకున్నారు. కానీ అంతలోనే హైకోర్టు అడ్వకేట్లు ఎంట్రీ ఇచ్చారు. తమ క్లయింట్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉందని.. అది తేలే వరకు రిమాండ్ విధించడానికి లేదంటూ కోర్టులో వాదించారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు.
కౌశిక్‌రెడ్డి వార్నింగ్
తనను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడనని.. తాను Ak 47 అవుతనంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు పాడి కౌశిక్‌రెడ్డి. మంత్రులు ఇసుక దందా, పేదల భూములు కబ్జా చేస్తున్నారని.. ఆ అక్రమాలు ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. ఆదివారం హైదారాబాద్‌లో ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తానంటూ బాంబు పేల్చారు.
బీఆర్ఎస్ హంగామా..
పాడి ఎపిసోడ్‌లో ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడంపై కేటీఆర్, హరీశ్‌రావులు మండిపడ్డారు. అటు, సుబేదారి పీఎస్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం భారీ భద్రత మధ్య కౌశిక్‌రెడ్డికి వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఖాజీపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రిమాండ్ విధించడం.. ఆ తర్వాత వెంటనే బెయిల్ మంజూర్ చేయడం జరిగింది.
దొంగకు సపోర్ట్?
కౌశిక్‌రెడ్డిది బ్లాక్‌మెయిల్ చరిత్ర అని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కౌశిక్‌రెడ్డి చాలా పైసలు తీసుకున్నారని.. అలాంటి వ్యక్తి అరెస్ట్‌ను ఖండిస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుకు సిగ్గుండాలన్నారు. కేటీఆర్, హరీష్‌రావు ఒక్క దొంగకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కౌశిక్‌రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. పైసల కోసం క్రషర్ వాళ్లని బ్లాక్‌మెయిల్ చేసినందుకు కౌశిక్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఫైర్
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై BRS స్పందిస్తున్న తీరును ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ వనరులను దోచుకున్న నాయకులు జైలుకు పోతుంటే.. BRS నేతలు హడావిడి చేస్తున్నారన్నారన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. జై తెలంగాణ అంటే.. చేసిన తప్పులు పోతాయా? బెదిరింపులకు పాల్పడిన నాయకుడిని అరెస్ట్ చేస్తే.. ఎలా అక్రమ అరెస్ట్ అవుతుందని ప్నశ్నించారు. BRS నాయకులు తిన్న ప్రతి పైసాను కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
పాడి కౌశిక్ రెడ్డిని మందలించాల్సిందిపోయి సపోర్ట్‌గా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుందని.. అందుకే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెబుతారని అన్నారు.