Hyderabad CUR: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ మహానగరాన్ని అడ్డగోలుగా లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చి కొత్తగా కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పేరుతో తీసుకొస్తున్న విధానం ప్రజలకు ఒక శాపంలా మారబోతోందని హెచ్చరించారు. ఈ విధానం ద్వారా కార్పొరేటర్లకు విలువ లేకుండా పోతుందని, మేయర్‌కు ఎలాంటి అధికారాలు ఉండవని, మొత్తం పెత్తనాన్ని ముఖ్యమంత్రి తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు.
దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారీగా పన్నుల భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం, నూతన జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదని, ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలని, కానీ నేడు రేవంత్ రెడ్డి సర్కార్ నిరంకుశ చర్యలను చూసి ప్రజలు భయపడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం రాగానే హైడ్రా పేరుతో చేతికి గడ్డపార పట్టి పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేశారని ధ్వజమెత్తారు. అలాగే పరిశ్రమల భూములను, ఇతర భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి, ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పాలన నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి సొంతంగా నిధులు సమకూర్చుకునే సామర్థ్యం లేక కేవలం బిల్డర్లు, రియల్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 15 శాతం కమీషన్లు ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అది ఏకంగా 30 శాతం కమీషన్ సర్కార్‌గా మారిందని దుయ్యబట్టారు.
Also read: బిగ్ బాస్ పై సోనియా షాకింగ్ కామెంట్స్..గుర్తింపు రాలేదు అంటూ!
రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని స్పష్టం చేశారు. ఇటీవలి ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో తెలంగాణలో బీజేపీ 8 నుంచి 10 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతోందని స్పష్టమైందని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థులే మన దేశ భవిష్యత్తు అని చెప్పారని, నశా ముక్త్ భారత్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందేశమిచ్చాని రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ లో బీజేపీ విస్తృత ప్రజా ఉద్యమాలు చేపట్టనుందని రాంచందర్ రావు వెల్లడించారు.
వివాదాస్పద 22 ఏ భూముల నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు భారీ మహా దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించనున్నామని, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
Also read: గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది