Kavitha: ఇందూరు వేదికగా రాజకీయ పునరేకీకరణకు బీజం వేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ నుంచి సమర శంఖం పూరించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు.
2014లో ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ, రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులను మట్టి కరిపించడంలో కవిత వ్యూహ రచన ఎంతో ఉంది. తాను నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికవగా జహీరాబాద్ లోక్ సభ స్థానంలో కొత్త అభ్యర్థిని గెలిపించారు. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన తొమ్మిది మందిలో నలుగురు అది వరకే ఎమ్మెల్యేలుగా గెలవగా ఐదుగురు మొదటి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
సీనియర్, జూనియర్ నాయకులతో పాటు పార్టీ శ్రేణులను తెలంగాణవాదులను ఏకం చేసి అన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధించడంలో కవిత క్రియాశీలంగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిజామాబాద్ ఎమ్మెల్యే పదవికి ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు దిగితే కలిపి బలపం కట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి సీనియర్ నాయకుడు డీఎస్ పై విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు.
Also read: రెండో పెళ్లిపై ట్రోల్స్… ఒక్క ఫోటోతో కౌంటర్ ఇచ్చిన నటి శిరీష!
తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ ప్రశస్తిని విశ్వవ్యాప్తం చేసిన కవిత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు తీసుకున్న కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సోమవారం మొదటిసారిగా ఇందూరు గడ్డపై అడుగు పెడుతున్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన ఎజెండా అయిన పాంచజన్యం ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సభ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన ఎజెండాను ప్రజలకు వివరించడంతో పాటు ఇదే వేదికపై నుంచి ఉమ్మడి నిజామాబాద్ నేతల రాజకీయ పునరేకీకరణకు పిలుపునివ్వనున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న తెలంగాణవాదులను, తెలంగాణ ఉద్యమకారులను, ఈ గడ్డపై మమకారం ఉన్న నేతలను ఏకతాటిపైకి తెచ్చి రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా అడుగులు చేస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇందల్వాయి మండలం గన్నారంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేస్తారు. మాధవ నగర్ సాయిబాబా గుడి వద్ద నుంచి ర్యాలీగా నిజామాబాద్ నగరానికి బయల్దేరుతారు.
మాధవ నగర్ సాయిబాబా ఆలయం నుంచి పులాంగ్ చౌరస్తా, రాజ రాజేంద్ర చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల మధ్య సమావేశ వేదిక వద్దకు కవిత చేరుకుంటారు.
Also Read: నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!