Nurse Death: హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో నర్స్ గా పనిచేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉండటం.. ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో జరిగింది హత్య అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై అఘాయిత్యం జరిపి.. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు.
హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చొట్టిగూడెం గ్రామానికి చెందిన బ్రహ్మయ్య కూతురు శిరీష (21) తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో 8 నెలల నుంచి నర్స్ గా ఉద్యోగం చేస్తోంది. ఆస్పత్రికి చెందిన స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విధులకు హాజరు కావాల్సి ఉండగా ఆమె రాలేదు. తలుపులు ఎన్నిసార్లు కొట్టినా శిరీష నుంచి సమాధానం రాలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. చూడగా ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్న శిరీష మృతదేహం కనిపించింది. వెంటనే క్లూస్ టీం సిబ్బందిని రప్పించి.. పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
దర్యాప్తులో భాగంగా గది కిటికీని లాగి చూసినపుడు ఊడి చేతికి వచ్చింది. ఈ నేపథ్యంలో దుండగులు ఆ కిటికీ ద్వారా లోపలికి చొరబడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లోపలికి వచ్చేటపుడు కిటికీ స్క్రూలు ఊడదీసి ఉండవచ్చని భావిస్తున్నారు. పారిపోయే సమయంలో హడావుడిగా కిటికీని దాని స్థానంలో పెట్టేసి స్క్రూలు బిగించకుండా వెళ్లిపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు.
ఇక, శిరీషపై అఘాయిత్యం కూడా జరిగినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఆమె ప్రతిఘటించి ఉండవచ్చని.. దాంతో దుండగులు ఆమె ముఖంపై కొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాళ్లపై కూడా కొట్టి గాయపరిచి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, శిరీష ముఖంపై దిండు పెట్టి అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
శిరీష మరణం వెనుక ఓ బిహారి యువకుడి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు స్టాఫ్ నర్స్ క్వార్టర్స్ ప్రాంతంలోనే ఉంటున్నాడు. ఓ కారు షెడ్ లో అతను మెకానిక్ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆధారాల కోసం హత్య జరిగిన పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read: షాపింగ్ మాల్ కోసం.. 200 ఏళ్ల నాటి గురుద్వారా కూల్చివేత.. పాక్‌ను ఏకిపారేస్తున్న సిక్కులు!
మరోవైపు శిరీష హత్య వెనక రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు ఆరోపించారు. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే శిరీష హత్య జరిగిందన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.