
Telangana BJP news(Political news in telangana) :
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొంది. తొలుత 115 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఎలక్షన్ హీట్‌ను పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. ఆ తర్వాత కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల రేస్ లో వెనుకబడిన బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.
ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న నేతల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసి హైకమాండ్‌కు లిస్ట్ పంపిస్తారు. అధిష్టానం ఫైనల్ చేశాక ఈ నెల 17 తర్వాత అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది.
ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక వ్యవస్థను బీజేపీ ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాషాయ పార్టీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టింది. దీంతో దరఖాస్తులను సమర్పించేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. అయితే ఎంపీలు మాత్రం ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. మళ్లీ ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు ఎంపీలుగా గెలిచారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ అంబర్ పేటలో కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో భోత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి సోయం బాపూరావు ఓడిపోయారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. ఎంపీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. గత అనుభవం నేపథ్యంలో మరోసారి తెలంగాణలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు .. అసెంబ్లీ బరిలో నిలుస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు లేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. 119 స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేరనేది వాస్తవమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఎంతమంది నుంచి దరఖాస్తులు వస్తాయో చూడాలి.