MLA Rajasingh: తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇంటబయట రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ కాసింత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణా కమిటీ సిద్ధమైంది. రేపో మాపో ఆయనకు నోటీసులు జారీ చేయనుంది.
తెలంగాణ బీజేపీలో ఫైర్‌బ్రాండ్ అంటే ముందుగా ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ సిటీలో మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారాయన. గోషామహల్ అంటే రాజాసింగ్.. రాజాసింగ్ అంటే గోషామహల్ అనేలా తన నియోజకవర్గాన్ని తయారు చేసుకున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ఏది మనసులో దాచుకోరు. పార్టీ వ్యవహారశైలిపై ఉన్నది ఉన్నట్టుగా బయటకు చెబుతారు. ఎవరు ఏమనుకున్నా ఆయన పట్టించుకోరు. ఆయన ఆలోచన మంచిదే కావచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం అలాంటి ఆలోచన పనికి రాదంటున్నారు కొందరు నేతలు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన బయటపెట్టడం నేతలకు ఇబ్బందిగా మారింది.
హైకమాండ్‌తో రాష్ట్ర నేతలు మంతనాలు జరిపారు. ఈ విషయంలో పార్టీ కూడా సీరియస్‌గా ఉంది. దీనికి సంబంధించి హైకమాండ్ నుంచి రాష్ట్ర యూనిట్‌కు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ బీజేపీ క్రమశిక్షణ కమిటీ రేపో మాపో ఆయనకు నోటీసులు ఇవ్వనుంది. ఆ వ్యాఖ్యల వెనుక సారాంశం తెలుసుకున్న తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ? లేక బహిష్కరిస్తారా ? అన్నది ఉత్కంఠగా మారింది.
ALSO READ: రాజ్‌భవన్‌లో మిస్ వరల్డ్.. ముద్దుగుమ్మలకు తేనేటి విందు, సీఎం రేవంత్ హాజరు
ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసరుతున్నారు. అంతేకాదు పార్టీ నేతలను థర్డ్ జెండర్లతో పోల్చుతూ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై వేటు వేయకుంటే కష్టమని అంటున్నారు. ఆయన మాదిరిగా మరికొందరు తయారయ్యే అవకాశముందని అంటున్నారు.
గతంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను బహిరంగంగా సమర్ధించారు రాజాసింగ్. ఆ అంశం ఇరుపార్టీల మధ్య చర్చకు దారి తీసింది. ఆయన మాటలు ముమ్మాటికీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని అంటున్నారు. పార్టీకి నష్టం కలిగేలా ఆయన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
మూడేళ్ల కిందట సరిగ్గా 2022లో ఆగస్టులో ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ కామెడీ షో పేరుతో ఓ వీడియో రిలీజ్ అయ్యింది. దాదాపు 10 నిమిషాల వీడియోలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మైనార్టీ వర్గాలు మండిపడ్డాయి. పరిస్థితి గమనించిన బీజేపీ హైకమాండ్, ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ శాసనసభా పక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెల్సిందే. మరుసటి ఏడాది 2023 ఎన్నికల సమయంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేసింది హైకమాండ్. ఆయన మళ్లీ గెలవడం జరిగింది. అప్పడు మాదిరిగా ఇప్పుడు సస్పెన్షన్‌తో సరిపెడతారా? బహిష్కరిస్తారా అన్నది చూడాలి.