పిల్లల్ని పెంచడం అంటే చదువు చెప్పించడం మాత్రమే కాదు. వారికి మంచి విలువలు నేర్పడం, ఆధునిక కాలానికి తగ్గట్టు వారిని ఆత్మవిశ్వాసంతో పెంచడం. ముఖ్యంగా కూతురు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కొన్ని విషయాలను ఆమెతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆమెను ఈ సమాజాన్ని తట్టుకునే విధంగా ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రతో, ధైర్యంగా పెరిగేలా పెంచాలి.ఈ విషయాలన్నీ కూతురితో బహిరంగంగానే చర్చించాలి.
ఎంతోమంది అమ్మాయిలు ఎదుగుతున్న కొద్దీ సమాజం అంటే భయపడతారు. సమాజంలోకి వెళ్లడానికి కూడా సంకోచిస్తారు. తమ మనసులోని మాటను పదిమందికి చెప్పలేరు. వేరే వారి మీద ఆధారపడడం మొదలుపెడతారు. దీనివల్ల వారు తాము అనుకున్నది సాధించలేరు. నచ్చినట్టు జీవించలేరు. అందుకే చిన్నప్పటినుంచి కూతుళ్లను ధైర్యంగా, స్వావలంబనతో పెరిగేలా చేయాలి. వారిపై వారికి నమ్మకం కలిగేలా తల్లిదండ్రులే వారిని పెంచాలి.
ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో ఆమెకు ముందు నుంచే చెప్పండి. అలాగే తనపై తనకు నమ్మకాన్ని కలిగి ఉండమని కూడా చెప్పండి. ఏ పరిస్థితుల్లోనైనా భయపడకూడదని వివరించండి. తనకు తాను స్వయంగా నిర్ణయం తీసుకోవడం తనకే వదిలేయండి. అలా సరైన నిర్ణయాలే తీసుకోవడం ఎలాగో కూడా నేర్పండి.
ఆత్మ రక్షణ కోసం
ఆత్మ రక్షణ ఎప్పుడూ ముఖ్యమని ఆమెకు వివరించండి. ఆడపిల్లల విషయంలో ఇప్పుడు భద్రత ముఖ్యమైన విషయంగా మారింది. ఎలాంటి అసౌకర్యపరిస్థితులు ఎదురైనా కూడా ఎలా స్పందించాలో ఆమెకు చెప్పండి. అలాగే ఆత్మరక్షణకు ఉపయోగపడే విషయాల్లో శిక్షణ ఇప్పించడం మంచిది. అలాగే కొన్ని రకాల హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఆమెకు సమాచారాన్ని అందుబాటులో ఉంచండి.
డబ్బు ప్రాముఖ్యతను చిన్నప్పుడు నుంచి వివరించండి. డబ్బు ఆదా చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలో చెప్పండి. అలాగే సరైన పెట్టుబడులు పెట్టడం ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండడం కూడా ఎలాగో చెప్పండి. ఆర్థిక స్వతంత్రం పొందడం చాలా ముఖ్యమని వివరించండి.
శారీరక మార్పులు
ఎదుగుతున్న ఆడపిల్లకు శారీరక మార్పుల గురించి కూడా తల్లి వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఋతుస్రావం, దానివల్ల వచ్చే సమస్యలు, అది ఎందుకు ఒక స్త్రీకి అవసరమో కూడా వివరించండి. శరీరంలోని మార్పుల గురించి ఆమెతో బహిరంగంగా మాట్లాడండి. ఇది ఒక సహజ ప్రక్రియను ఎటువంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పండి. అలాగే ఆ సమయంలో పరిశుభ్రంగా ఉండడం ఎందుకు అవసరమో కూడా వివరించండి.
మంచి, చెడు అనుబంధాల మధ్య తేడాను కూడా ఆమెకు నేర్పాల్సిన అవసరం ఉంది. కొంతమంది అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా చెప్పండి. సమాజంలో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండడం ఎంత ముఖ్యమో వివరించండి. ఎదుటివారిని గౌరవించడం, తిరిగి ఆ గౌరవాన్ని పొందడం కూడా ఆమెకు వివరించండి .
మొదటి నుంచి ఆమె కూతురికి సంబంధించి కెరియర్ విషయంలో మాట్లాడుతూ ఉండండి. ఆమెకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ రంగంలో ఆమెను చదివించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి రంగంలోనే ముందుకు సాగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
వద్దు అనే హక్కు
తనకు నచ్చకపోతే ఏదైనా సరే వద్దు అనే చెప్పే హక్కు ఆమెకు ఉందని చెప్పండి. ఎవరికోసమో మొహమాటానికి పోయి నచ్చని పనిని చేయాల్సిన అవసరం లేదని వివరించండి. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చెప్పండి.