MUNUGODU BYPOLL: మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై వివాదం రాజుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఫలితం వెల్లడిలో ఎందుకు జాప్యం జరుగుతోందంటూ సీఈవో వికాస్ రాజ్ కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో ఎన్నికల సంఘం సైట్ లో అప్‌లోడ్ చేశారు.
రౌండ్లవారీగా ఫలితాల వెల్లడిలో సీఈవో వికాస్ రాజ్ తీరు అనుమానాస్పదంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్ చేయడం లేదన్నారు. బీజేపీ లీడింగ్‌లోకి వచ్చినా ఫలితం వెల్లడించడం లేదని ఆరోపించారు. మొదటి రెండు రౌండ్ల తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్ చేసేందుకు గల జాప్యానికి కారణాలేంటో సీఈవో చెప్పాలని సంజయ్ నిలదీశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆలస్యంపై సీఈఓ వికాస్‌రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందునే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తున్నామన్నారు.అందుకే ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడానికి ఆలస్యమవుతోందని సీఈఓ వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.