బీజేపీలోకి కొత్త రక్తం
⦿ బీజేపీ సంస్థాగత ఎన్నికల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్
⦿ పార్టీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం
⦿ రాబోయే ఎన్నికలు, కాంగ్రెస్ పాలన, గ్యారెంటీలపై చర్చ
⦿ కేసీఆర్ పదేళ్ల పాలనపై విమర్శలు
⦿ నేడు ప్రభుత్వంపై ఛార్జ్ షీట్
హైదరాబాద్, స్వేచ్ఛ: Kishan Reddy: జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. శనివారం కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. రాబోయే ఎన్నికలు, కాంగ్రెస్ ఏడాది పాలనపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి.
కేసీఆర్ ప్రభుత్వంలో అహంకారం
తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, పదేండ్లు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమయం అయ్యిందని అన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని ప్రజలు భావించారని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని వ్యాఖ్యానించారు. కానీ, ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అహంకారం, నియంతృత్వం, అవినీతి, వైఫల్యాలను చూశామని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ ఆధారంగా నడిచే పార్టీ కాదన్నారు.
త్వరలో ఉద్యమ బాట
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అండగా నిలబడుతోందని వివరించారు. జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధి కోసం కేంద్రం అనేక సహకారాలు అందిస్తోందని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి ఉద్యమ బాట పడతామని, పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఆ దిశగా ఉంటుందని స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుండి కొత్త నాయకత్వం రావాలని, మంచి కమిటీలు ఏర్పాటు కావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాలుగా అండగా నిలబడుతామని మోదీ స్పష్టం చేసినట్టు వివరించారు.
నేడు ఛార్జ్ షీట్
కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతోం ది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల ముందు ఛార్జ్ షీట్ పెట్టబోతున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి. జిల్లా, అసెంబ్లీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.