BJP Manifesto : తెలంగాణ ప్రజా కురుక్షేత్రంలో బీజేపీ నత్తనడక ధోరణిని ఇంకా కొనసాగిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటికీ మేనిఫెస్టో ప్రకటించకపోవడం ఆసక్తిగా మారింది. ఆ పార్టీ కమిటీల నుంచి ఒక్కొక్కరుగా జంప్ అవడంతో అసలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా..? లేదంటే అలాగే ఎన్నికలకు వెళ్తుందా అన్న సందిగ్ధత కూడా నెలకొంది.
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వివేక్ వెంకటస్వామి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరడంతో బీజేపీకి షాక్ తగిలింది. ఈ ఎఫెక్ట్ మేనిఫెస్టో రూపకల్పనపై పడింది. అయితే.. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్న కమలనాథులు.. నవంబర్ 12 లేదా 13వ తేదీల్లో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోపక్క మేనిఫెస్టోలోని కీలక అంశాలు లీక్ అయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల పేర్ల మార్పుపై మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా,.. నిజామాబాద్‌ను ఇందూరుగా.. వికారాబాద్- గంగవరంగా, కరీంనగర్ – కరీనగర్‌గా, మహబూబ్‌నగర్-పాలమూరుగా, అదిలాబాద్ -ఎదూలపురంగా, మహబూబాబాద్ -మానుకోటగా పేరు మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. కాగా.. గతంలో బీజేపీ నేతల నుంచి పేర్ల మార్పుపై చాలా సార్లు ప్రస్తావన రాగా.. ఈ ప్రాంతాల పేర్ల మార్పు వ్యూహం ఎంత వరకు వారికి కలిసివస్తుందన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే ఆరు గ్యారంటీ స్కీంలతో కాంగ్రెస్ ప్రజలను ఆకర్షిస్తుండగా.. బీఆర్‌ఎస్ కూడా పెన్షన్లు, రైతుబంధు పెంపుతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచి ఎన్నికల వరాలను కురిపించారు కేసీఆర్. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎలాంటి హామీలను ఇవ్వనుంది.. ఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుంది.. మేనిఫెస్టోలో ఉన్న భరోసా ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది.