BJP : ఇతను ఎవరో తెలుసా? బీజేపీలో ఎప్పుడైనా చూశారా? ఏ వేదిక మీదైనా కనిపించారా? ఏ బడా లీడర్ వెనకాలైనా ఉన్నారా? ఇతను మాట్లాడుతుండగా ఎప్పుడైనా విన్నారా? మీడియా ప్రెస్‌మీట్లలో కవర్ అయ్యారా? ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలే బదులు చెప్పడం కష్టం అంటున్నారు. కానీ, ఇతను ఇప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి. పేరు గౌతమ్‌రావు. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. కాషాయ పార్టీలో మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది.
గౌతమ్‌రావు బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
చాలామందికి తెలీక పోయినా.. ఈయనేమీ మామూలు లీడర్ కాదు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ ప్రాంతం ప్రజలకు, అక్కడి కమలం శ్రేణులకు సుపరిచితమే. సిటీలో స్ట్రాంగ్ లీడరే అంటున్నారు. అందుకే ఆయన్ను ఏరికోరి ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశామంటోంది కాషాయదళం. మే 1తో ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగుస్తుంది. ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీజేపీ తరఫున బలమైన అభ్యర్థిని నిలపాలనే ఉద్దేశ్యంతో పార్టీకి ఇన్నేళ్లూ విధేయుడిగా ఉన్న గౌతమ్‌రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఆయన అభ్యర్థిత్వంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భగ్గుమంటున్నారు.
మీ గులాంలకే పదవులా? రాజాసింగ్ రచ్చ
ఇంకెవరూ లీడర్లు లేనట్టు.. గౌతమ్‌రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఏంటనేది రాజాసింగ్ క్వశ్చన్. డైరెక్ట్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డినే టార్గెట్ చేశారాయన. మీ నియోజకవర్గానికే పదవులు ఇస్తారా? గులాంగిరీ చేసేవారికే టికెట్లు ఇస్తారా? ఇతర పార్లమెంట్‌లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనిపించరా? అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్.. కిషన్‌రెడ్డిపై పదునైన విమర్శలు చేశారు.
Also Read : HCUపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
బీజేపీలో డిష్యూం డిష్యూం
కిషన్‌రెడ్డి vs రాజాసింగ్. చాలాకాలంగా వాళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజా ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో మరోసారి బ్లాస్ట్ అయింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్‌తో కిషన్‌రెడ్డి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేశారంటూ ఇటీవల రాజాసింగ్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌పై పార్టీ తీవ్ర రచ్చ నడిచింది. గతంలో తనపై పీడీ యాక్ట్ పెట్టి.. జైల్లో పెట్టడం వెనుక తమ పార్టీ పెద్దలే ఉన్నారంటూ పరోక్షంగా కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ పదునైన ఆరోపణలు కూడా చేశారు. టీబీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రతిపాదన వచ్చిన ప్రతీసారీ.. రాజాసింగ్ నోటికి పని చెబుతుంటారు. ఆయన చేసే విమర్శలన్నీ కిషన్‌రెడ్డికి తూటాల్లా గుచ్చుకుంటాయని అంటారు. ఎమ్మెల్యే రాజాసింగ్.. బండి సంజయ్ బ్యాచ్‌గా ముద్ర పడ్డారు. కిషన్‌రెడ్డి.. ఈటల రాజేందర్‌ను ప్రమోట్ చేస్తున్నారని.. రఘునందన్‌రావును ఎంకరేజ్ చేస్తుంటారనేది పార్టీ శ్రేణుల్లో ఓపెన్ టాక్. లోలోపల వాళ్లూవాళ్లూ ఏమైనా అనుకోవచ్చు. కానీ, రాజాసింగ్ ప్రతీసారి కిషన్‌రెడ్డిని బహిరంగంగానే మాటలతో గిల్లుతుండటం.. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీలో అసలు క్రమశిక్షణే లేదని.. కేవలం శిక్షలే ఉన్నాయనే విషయం స్పష్టం చేస్తోంది. లేటెస్ట్‌గా బీజేపీ తరఫున ఎమ్మెల్సీ కేండిడేట్‌గా ఎంపికైన గౌతమ్‌రావు ఎపిసోడ్‌తో పార్టీలో విభేధాలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు.