Ramchander Rao: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాష్ట్రంలో అడుగుపెడితే చూస్తూ ఊరుకోమని, కచ్చితంగా అడ్డుకుని తీరతామని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నల్ల జెండాలతో నిరసన స్వరం
ఎన్నికల సమయంలో యువతకు, రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రాహుల్ గాంధీ మోసం చేశారని రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాహుల్ పర్యటనను నల్ల జెండాలతో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడాన్ని తాము స్వాగతిస్తామని, భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకం కాదని చెప్తూనే.. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందనే విషయాన్ని గుర్తుచేశారు.
రైతుల సమస్యలపై నిర్లక్ష్యం
ఎల్ నినో ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో రైతుల కష్టాలను పట్టించుకోకుండా ఢిల్లీ వేదికగా రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం తను చేయాల్సిన సాయాన్ని పక్కనపెట్టి, ఉద్దేశపూర్వకంగానే కేంద్రంపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడేందుకు బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.
దీపావళి తర్వాత పాదయాత్రలు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దీపావళి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్రలు చేపడతామని బీజేపీ తెలిపింది. ఈ పర్యటనలకు జాతీయ స్థాయి అగ్రనాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని రాంచందర్ రావు వెల్లడించారు. తాజా పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
Also Read: మాదాపూర్‌కు సరికొత్త ల్యాండ్‌మార్క్.. లగ్జరీ లుక్‌లో తమ్మిడికుంట చెరువు!