Government Land: విలువైన ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా వేలం వేస్తూ తాత్కాలిక ఆదాయ సమీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ విధానం తెలంగాణను భవిష్యత్తులో ఆస్తుల దివాలా దిశగా నడిపించే ప్రమాదం ఉందని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ భూముల విక్రయాలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక విశ్వసనీయత దెబ్బతినడంతోపాటు భవిష్యత్తులో రుణాలు పొందే సామర్థ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) ద్వారా మరిన్ని ప్రభుత్వ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కనపెట్టి, శాశ్వత ప్రజా ఆస్తులను తాత్కాలిక ఆదాయం కోసం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కొత్త ఆదాయ వనరులను సృష్టించకుండా విలువైన ఆస్తులను విక్రయించడం వల్ల రాష్ట్ర ఆర్థిక పునాదులు బలహీనపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల అవసరం ఏర్పడినప్పుడు ప్రభుత్వం తన ఆర్థిక సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకుంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ రుణ సామర్థ్యం కేవలం ఆదాయంపైనే కాకుండా ఆర్థిక క్రమశిక్షణ, రుణ చెల్లింపుల సామర్థ్యం, ఆర్థిక విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రాలు తమ సమీకృత నిధులపై రాజ్యాంగబద్ధంగా రుణాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి బలమైన ఆస్తుల పునాది కూడా కీలకమని అన్నారు. ప్రభుత్వ హామీలు అనేవి తీవ్రమైన ఆర్థిక బాధ్యతలని, వాటిని బలమైన ఆర్థిక నిర్వహణకు ప్రత్యామ్నాయంగా భావించరాదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థల ఆస్తులు తగ్గిపోతే భవిష్యత్తులో నిధుల సమీకరణ, రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రెవెన్యూ, వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం స్వల్పకాలిక ఆదాయంపైనే దృష్టి సారిస్తూ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విలువైన భూములను వేలానికి సిద్ధం చేస్తోందని విమర్శించారు. భూమి పరిమితమైన వనరు అని, ఒకసారి విక్రయిస్తే తిరిగి ప్రభుత్వానికి అందుబాటులోకి రాదని అన్నారు.
కాగ్‌కు సంబంధించిన గణాంకాలను ప్రస్తావిస్తూ, 2023-24లో తెలంగాణకు భూములు, ఆస్తులు, ఇతర వనరుల ద్వారా రూ.16,478 కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది రాష్ట్ర పన్నేతర ఆదాయంలో సుమారు 69 శాతమని తెలిపారు. 2022 మార్చి 31 నాటికి అప్పటి టీఎస్ఐఐసీ వద్ద 53,473.76 ఎకరాల భూమి ఉండగా, 2014-15 నుంచి 2021-22 మధ్య 2,355 కేటాయింపుల ద్వారా సుమారు 4,050 ఎకరాలను కేటాయించినట్లు కాగ్ ఆడిట్ నివేదికలు వెల్లడించాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాయదుర్గం-నాలెడ్జ్ సిటీలో సుమారు 31 ఎకరాలను వేలం వేసి దాదాపు రూ.730 కోట్లు సమీకరించిందని, 2023 ఆగస్టులో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరా ధర రూ.100.75 కోట్లకు చేరిందని నారాయణ రెడ్డి గుర్తుచేశారు.
Also Read: మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!
2024 జనవరి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాయదుర్గం-నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో దాదాపు 40 ఎకరాలను వేలం వేసి సుమారు రూ.7,000 కోట్లు సమీకరించిందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఎకరా సగటు ధర రూ.179 కోట్లకు చేరిందని తెలిపారు. 2025 అక్టోబర్‌లో ఎకరా రూ.177 కోట్లు, 2026 మేలో రూ.237 కోట్లు, అదే ఏడాది ఆగస్టులో రూ.264 కోట్లు, రూ.269 కోట్ల ధరలు నమోదయ్యాయని వివరించారు. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ 2025లో మూడు విడతలుగా నిర్వహించిన వేలాల్లో 27 ఎకరాల ద్వారా సుమారు రూ.3,708 కోట్లు సమకూరాయని, ఎకరా సగటు ధర రూ.137 కోట్లుగా నమోదైందని తెలిపారు. ఇంకా 114 భూములను వేలం వేసి సుమారు రూ.2,000 కోట్లు సమీకరించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిసరాల్లోని వ్యూహాత్మక భూములను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తుండటంతో భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నారాయణరెడ్డి హెచ్చరించారు. 2025 సెప్టెంబర్ నాటికి టీజీఐఐసీ వద్ద పారిశ్రామిక కేటాయింపుల కోసం 5,730 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫ్యాక్టరీలు, ఐటీ క్యాంపస్‌లు, తయారీ రంగ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని ఎక్కడి నుంచి సమకూరుస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రజా అవసరాల కోసం భూములను ఎలా కేటాయిస్తుందని నిలదీశారు. భూముల వేలాల ద్వారా ఒకేసారి ఆదాయం వస్తుందని, పరిశ్రమల ద్వారా మాత్రం ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, సరఫరా వ్యవస్థల బలోపేతం, నిరంతర పన్ను ఆదాయం సమకూరుతాయని వివరించారు.
పరిశ్రమల పార్కుల ఏర్పాటు, తయారీ రంగానికి ప్రోత్సాహం, ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు, భూసమీకరణ, ఉద్యోగాల కల్పన ఆధారిత ప్రోత్సాహకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విధానంపై తక్షణమే సమీక్ష నిర్వహించాలని, రాష్ట్రంలో మిగిలి ఉన్న ప్రభుత్వ భూముల సమగ్ర జాబితాను ప్రజలకు వెల్లడించాలని నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మిస్తున్నారా? లేక విలువైన ఆస్తులను వేలం వేసి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారా? అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: కళ్ళు తెరిచి చూస్తే నిజమైన గేమ్‌లో… కానీ రియల్ లైఫ్‌లో నరకం… డార్క్ యాక్షన్ సిరీస్