BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ)తో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ ఇప్పటి నుంచే సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న వరంగల్, ఖమ్మం నగరాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత బలోపేతంపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్య నేతలతో పార్టీ శనివారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలోని 9 జిల్లాలకు చెందిన పార్టీ ఇన్‌చార్జీలు, అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొని స్థానిక రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
కేవలం ఎన్నికల వ్యూహాలకే పరిమితం కాకుండా, నగరాల్లోని ప్రజా సమస్యలపై పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, వరద ముంపు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లో తొలి వానకే నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఇలాంటి అంశాలను లేవనెత్తి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అవసరమైతే.. డ్రైనేజీ సమస్యలు, వరద ముంపు, రహదారుల దుస్థితిపై స్థానిక డివిజన్లలో నిరసనలు చేపట్టేందుకు కూడా వెనుకాడొద్దని నిర్ణయించినట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రణాళిక, మౌలిక వసతుల కల్పనలో విఫలమైందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: రైలు కోబ్రా కలకలం.. సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెనుముప్పు!
ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ తరఫున నియమితులైన బూత్ లెవెల్ అధికారులు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను చేర్పించడంతో పాటు, జాబితాలో ఉండే అక్రమ లేదా నకిలీ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లకు గట్టి పోటీ ఇస్తూ పట్టణ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ఈ విస్తృత స్థాయి కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ, స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారానే కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేయడం సాధ్యమవుతుందని ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు నాయకత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. సంస్థాగత లోపాలను సరిదిద్దుకుంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం కేడర్‌కు పిలుపునిచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Also read: పిల్లలను అతిగారబం చేయడం వారి భవిష్యత్తుకు హానికరం.. తల్లిదండ్రులు ఈ పొరపాట్లు అసలు చేయకూడదు