Big Stories

Hospital : ఇద్దరు బాలింతలు మృతి.. మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

Hospital : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల మృతి ఘటనలు మరోసారి తెలంగాణలో కలకలం రేపాయి. ఇద్దరు బాలింతల మృతి చెందడంతో హైదరాబాద్ మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

- Advertisement -

నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తన భార్య సిరివెన్నెల (23)ను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా సిరివెన్నల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

- Advertisement -

తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివాణి ఈ నెల 9న మలక్‌పేట్‌ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని ప్రాణాలు కోల్పోయింది.

ఒకే సమయంలో ఇద్దరు బాలింతలు మృతి చెందటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి కొందరు బాలింత మృత్యువాత పడ్డారు. తరచూ ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News