మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది.అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని ఆ రెండు పార్టీలు తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైతే అధికార పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నచోట అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందా? లేదా? అని ముందుగానే నివేదికలు తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బలంగా లేకపోతే బీజేపీ అభ్యర్థికి గులాబీ కేడర్ మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తున్నది. ఫలితంగా అక్కడి ఓటు బ్యాంకును క్యాచ్ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు జోరుగా చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే వారిని తమ పార్టీలోకి పిలిచి అదే స్థానంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు టికెట్లు ఇస్తున్నట్టు కూడా సమాచారం. ఒకవేళ వారు రాని పక్షంలో తమ కేడర్ ద్వారా మద్దతు ఇస్తామని, డబ్బులు కూడా అడ్జస్ట్ చేస్తామని.. గెలిచాక తమకే మద్దతివ్వాలని సైతం ముందే డీలింగ్స్ చేసుకుంటున్నట్టు సైతం ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీఆర్ఎస్‌లోకి.. ఈ రెండు పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి జంపింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు సైతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల వలే ఫలితాలు తారుమారు కాకుండా చూడాలని జిల్లా ఇన్‌చార్జి నేతలు స్థానిక నేతలను హెచ్చిరించినట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీకి అటు మెజార్టీ, ఇటు మైనార్టీల సపోర్టు కూడా ఉంది. బీజేపీకి మొత్తంగా మెజార్టీ ప్రజల మద్దతు ఉంటుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వీక్ ఉన్న చోట బీజేపీకి ఓట్లు వచ్చేలా ఇరు పార్టీల మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తుండగా.. బీజేపీ వీక్ ఉన్న చోట కమలదళం కారు అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తున్నది.ఇంటింటి ప్రచారంలోనూ బీఆర్ఎస్ నేతలు.. బీజేపీకి మద్దతివ్వాలని కొన్ని చోట్ల ప్రచారం చేస్తున్నట్టు జోరుగా చర్చ జరుగుతున్నది. అదే విధంగా బీజేపీ సైతం తమ అభ్యర్థి వీక్ ఉన్న చోట కారు గుర్తుకు ఓటు వేయానలి కోరుతున్నట్టు తెలుస్తున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం.
Wardhannapet Municipality: ఓట్ల కోసం బాల్యాన్ని బలి చేస్తారా? పిల్లల చేత కాళ్లు మొక్కించిన నేతలు!
బీజేపీ, బీఆర్ఎస్‌ల బంధం బయట పడటంతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం అని పదే పదే చెబుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ను ఓడించడమే ధ్యేయంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుటిల రాజకీయాలకు తెరలేపాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మున్సిపల్ మంత్రిని తానే అయినందున నిధులు తెచ్చి అభివృద్ధి చేసే వాళ్లను గెలిపించాలని.. మనవాళ్లు అయి ఉండాలని ప్రచారం చేస్తున్నారు. కాగా, బీజేపీ, బీఆర్ఎస్‌లు మాత్రం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చారా? మహిళలకు రూ.2500 వస్తున్నాయా? గ్యాస్ సబ్సిడీ వస్తుందా? తులం బంగారం ఎక్కడైనా ఇచ్చారా? అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇది అధిష్టానం నుంచి పొత్తు కుదరలేదని.. కిందిస్థాయి కేడర్ అధిష్టానానికి తెలియకుండా రహస్య ఒప్పందం చేసుకుని ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.