BIG Shock To KCR: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హంగు, ఆర్భాటాలు ప్రదర్శించిన గులాబీ పార్టీ నేతలు అధికారం చేజారగానే ఉలుకుపలుకు లేకుండా పోయారంట. కనీసం తమ తమ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు అందు బాటులో లేకుండా బీఆర్ఎస్ ఇన్చార్జులు గాయాబ్ అయ్యారంట. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల్లో ఉండాల్సింది పోయి పత్తాలేకుండా పోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురవుతోందిప్పుడు. జిల్లాలో దాదాపు గులాబీ పార్టీ ఇన్చార్జులు అందరూ సెగ్మెంట్లకు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా కనిపించి వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు.
నిజామాబాద్ జిల్లాలో పెద్ద దిక్కు కరువైన బీఆర్ఎస్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజవర్గాల్లో బాల్కొండ నియోజకవర్గం మినహాయిస్తే మిగిలిన అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్‌కు పెద్ద దిక్కే కరువైనట్టు కనిపిస్తోంది. పేరుకి పార్టీ అధిష్టానం ఇన్చార్జులను నియమించినా వారి తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం, నిస్తేజం వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ బాస్ కేసీఆర్ కు అండగా నిలిచింది. పదేళ్లు గంప గుత్తుగా తొమ్మిది నియోజక వర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలు పాగా వేశారు. అయితే స్వీయ తప్పిదాలతో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని కాంగ్రెస్ పార్టీకి అప్పగించారన్న విమర్శలున్నాయి.
ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు, కక్ష్య సాధింపు చర్యలు..
ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు, నియోజవర్గాల్లో కక్ష సాధింపు చర్యల మూలంగా ఓటమి పాలయ్యారని గులాబీ శ్రేణులే అంటున్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలని అంటారు. అయితే ఆ పరిస్థితి మాత్రం నిజామాబాద్ జిల్లా మాజీల్లో కనిపించడం లేదంట. ఓడిన ఎమ్మెల్యేలనే గులాబీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులుగా నియమించింది. అయితే ఓటమి తర్వాత కూడా వారిలో మార్పు రావడం లేదని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమి పాలై సుమారు రెండేళ్లు కావొస్తోంది. అయినా నాటి నుంచి నేటిదాక మాజీలు నియోజక వర్గాలపై దృష్టి పెట్టడం లేదంట. కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారని సొంత పార్టీ శ్రేణులు తెగ ఫైర్ అవుతున్నాయి. ఎక్కడకిక్కడ పార్టీ ఇంచార్జిలు సొంత పనుల్లో బిజీగా మారిపోయి పార్టీ వ్యవహారాలు పట్టించుకోవడం మానేశారంట.
2023 ఎన్నికల్లో జిల్లాలో రెండు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్
2023 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజవర్గాల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బాల్కొండ నుంచి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలుపొందగా, బాన్సువాడ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి హస్తం దోస్తానా చేస్తున్నారు. ఇక ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి మిగిలారు. జిల్లాలో ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు, అంతకుముందు 2014లో గంపగుత్తగా 9 స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ 2018 లో 8 స్థానాలు గెలుచుకుంది. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేందర్ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పి గులాబీ గూటికి చేరారు. దాంతో రెండవ సారి కూడా 9 స్థానాలు కారు పార్టీ ఖాతాలోనే నిలిచాయి.
రెండు సార్లు గెలిచి కోలుకోలేని ఓటమి మూటగట్టుకున్న నేతలు
2023 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు గులాబీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. కొన్నిచోట్ల మూడవ స్థానానికి పడిపోయారు. రెండుసార్లు వరుసగా గెలుపొందిన ఎమ్మెల్యేలు, మూడవసారి కోలుకోలేని ఓటమిని మూట గట్టుకున్నారు. కేవలం స్వయంకృతాపరాధంతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, తమకు ఎదురులేదని విర్రవీగిన నేతలకు పరాభవం ఎదురయింది. అయినప్పటికీ ప్రజల తీర్పుపై పురాలోచన చేసి ప్రజల్లో ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జుల్లో మార్పు రానట్లే కనిపిస్తోంది. ప్రభుత్వ హామీలు, అమలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పరిపాలన తీరు పై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీగా నిలదీయాల్సింది పోయి మౌనంగా ఉండడం, నియోజక వర్గానికి దూరంగా ఉండడం పట్ల పార్టీ శ్రేణుల్లోనే అసహనం వ్యక్తం అవుతోంది
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న మిగిలిన పార్టీలు
ప్రతిపక్ష పార్టీ నాయకులుగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. కొందరు ఇన్చార్జ్ నెలలకు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారం పార్టీకి తీరని నష్టాన్ని కలిగించనుంది. అధికారం లేనప్పటికీ అధినేత కేసిఆర్ పై ఉన్న నమ్మకంతో పార్టీ వీడని కార్యకర్తలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన ఇన్చార్జీలు నియోజకవర్గాలకు దూరం అవ్వడం వారిలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారి ధోరణి క్యాడర్‌కు ఏ మాత్రం మింగుడుపడటం లేదంట. అక్టోబర్ నెల చివరి వారంలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కానీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మాత్రం నియోజకవర్గ ఇన్చార్జిల ధోరణి మాత్రం మారడం లేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో పర్యటనలు కాదు కదా కనీసం క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదు. బిఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నాయకులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిలో ఇన్చార్జిలు ఉత్సాహాన్ని నింపలేకపోతున్నారనే విమర్శలున్నాయి.
Also Read: మరో ప్రమాదం.. బండ్లగూడలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు
ఒంటరి పోరాటం చేస్తున్న ప్రశాంత్‌రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక గులాబీ ఎమ్మెల్యే గా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై, హామీలపై విమర్శలు చేస్తూ… బాల్కొండ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెలలో కనీసం పదిరోజులు తప్పకుండా నియోజవర్గంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారట. ఉమ్మడి జిల్లాలో ఆయనొక్కరే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంట. మంత్రిగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రశాంత్ రెడ్డి అభివృద్ధితో పాటు అందుబాటులో ఉంటున్నారట. ఆ క్రమంలో ఇక జిల్లా పార్టీ బాధ్యతలు ఆయనకే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా గులాబీ ఇన్చార్జీలు తీరు మార్చుకోకుంటే, పార్టీ శ్రేణుల ఆలోచన మారే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story By Ajay Kumar, Bigtv