రాష్ట్ర రాజకీయాలు ఉన్నట్టుండి కీలక మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏం జరగడం లేదన్నంటూ ఒక్కసారిగా గులాబీ పార్టీ నేతలు మిన్నకుండిపోయారు. ఎవరూ బయటకు రావడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు సైతం పెద్ద సమస్యలపై ఫోకస్ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. గాంధీ సరోవర్ నిర్మాణంలో భాగంగా మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఆయన పెద్దగా ప్రజల సమస్యలపై స్పందించడంపై లేదని చర్చ జరుగుతున్నది. కీలక గులాబీ నేతలు, మాజీమంత్రులు సైతం బయటకు రావడం లేదని పార్టీలోనే డిస్కషన్ జరుగుతున్నట్టు సమాచారం.
సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల 16 నుంచి మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సెషన్స్ నిర్వహించేందుకు రాష్ట్ర కేబినెట్ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ పూర్తయ్యాక రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. కానీ, ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సర్కార్ నిర్ణయించింది. కాగా, ఈసారి బడ్జెట్ సెషన్స్ హాట్‌హాట్‌గా సాగుతాయని తెలుస్తున్నది. అయితే, వీటికైనా ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? రారా? అనేదానిపై క్లారిటీ లేదు. మరోసారి హరీశ్ రావు .. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేతగా వ్యవహరిస్తారా? అని చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అయినా.. ఆ పార్టీ నేతల కంటే బీజేపీ నేతలు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ లాంటి వాళ్లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరును వారు తూర్పార బడుతున్నారు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీనా? లేక బీజేపీనా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు పెరుగుతుంటే.. కారు పార్టీకి క్రమంగా తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ సొంతం చేసుకోకపోగా.. బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ తన ఖాతాలో వేసుకున్నది.
ఇదిలాఉండగా, రెండ్రోజుల కిందట కామారెడ్డి ఘటనపై బీజేపీ చాలా సీరియస్‌గా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నదని..మెజార్టీ ప్రజల మనోభావాలు ఆ పార్టీకి పట్టడం లేదని ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా నడుచుకోవడం తప్పా.. ఇక్కడి ప్రజల బాగోగులు, వారికి మనోభావాలు పట్టవా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు ఎంపీ అర్వింద్ సైతం రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ వర్గానికే కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తుందని ఫైర్ అవుతున్నారు. కాగా, బీఆర్ఎస్ నేతల నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ కనిపించడం లేదు. కామారెడ్డి ఘటనే కాకుండా, రెండ్రోజుల కిందట కులం పేరుతో దూషిస్తూ చిన్నారిని ప్రాణాలు బలిగొన్న ఘటనలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎందుకు స్పందించడం లేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఇది ఇలాగే కొనసాగితే బీజేపీ.. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితులు రావొచ్చుని చర్చ జరుగుతున్నది.