KTR on Konda Surekha: మాజీ మంత్రి కేటీఆర్ వార్తల్లో నిలిచేందుకు ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన లేవనెత్తిన అంశాలు వరుసగా బూమరాంగ్ అవుతున్నాయా? అయినా వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? జనం మరిచిపోయారని.. పాత విషయాలను గుర్తు చేస్తున్నారా? ఈ విధంగా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు ఆయన అభిమానులను వెంటాడుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ- కేటీఆర్ మాటల ఎపిసోడ్ గురించి అందరికీ తెలుసు. ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. రెండువారాల పాటు మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. దీనిపై న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ వ్యవహారం జరిగి దాదాపు రెండు వారాలు పైగానే గడిచింది.
ప్రజలు ఈ విషయం మరిచిపోయారని మళ్లీ ఎత్తుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధార వ్యక్తి గత ఆరోపణలు, దాడులు చేసిన వారిపై పోరాటం చేస్తానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశానని తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నది ఆయన మాట. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయకుండా స్పష్టమైన లైన్ ఉండాలన్నది ఆయన ఆవేదన. వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తానంటూ రాసుకొచ్చారు.
ALSO READ: హైడ్రా స్పీడ్.. నిర్మాణదారులకు నోటీసులెందుకు?
తనపై చౌకబారు వ్యాఖ్యలు చేసేవారికి ఇదొక గుణపాఠం అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో నిజం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందన్నది కేటీఆర్ మాట. కేటీఆర్ పోస్టుపై అటు కాంగ్రెస్ వాదుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. వ్యక్తిగతంగా మీరు చేసిందేంటని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు.
అధికారం పోయిన నుంచి బీఆర్ఎస్ ఏ అంశం ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతోంది. హైడ్రా, మూసీ, నేతల అంతర్గత వ్యవహారం, గ్రూప్-1 మెయిన్స్ ఇలా ఏ అంశం చూసినా బూమరాంగ్ అవుతూనే ఉన్నారు. దీంతో మళ్లీ పాత అంశాన్ని తెరపైకి తెచ్చారనన్నది కొందరు కాంగ్రెస్ నేతల మాట.