MLA Kotha Prabhakar Reddy: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శుత్రవులు ఉండరు. ఒకప్పుడు పార్టీలను నమ్ముకుని రాజకీయాలు చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎవరు, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలీదు. అది పార్టీ అభిప్రాయమా? లేక సొంత అభిప్రాయమా అనేది బయటకు చెప్పరు. ఒకవేళ ప్రశ్నిస్తే తన మాటలు మీడియా వక్రీకరించిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.. చేస్తుంటారు కూడా. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి.
మెదక్ జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోకి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఇస్తామని అంటున్నారని బయటపెట్టారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరిదీ ఇదే మాటన్నారు.
ఇంతకీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తున్న బిల్డర్లు ఎవరు? పారిశ్రామిక వేత్తలు ఎక్కడివారు? అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక ఏం జరిగింది.. జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు ఏమైనా కుట్ర చేస్తున్నాయా? లేక కారు పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ఆయన బయటపెట్టారా? అన్నది అసలు పాయింట్.
రెండు వారాల కిందట రేవంత్ ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. నియోజకవర్గం సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూల స్పందన వచ్చిందన్నారు. అంతలో ఆయన మాటలు మారినట్టు కనిపిస్తున్నాయి.
ALSO READ: జాగ్రత్త.. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలో చర్చ అప్పుడే మొదలైపోయింది. నార్మల్‌గా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు డబ్బులు ఇస్తామని అన్నారంటే అది ఆషామాషీ విషయం కాదు.
ప్రభుత్వంపై వాళ్ల పార్టీలో జరుగుతున్న కుట్రను బయటపెట్టారని అనుకోవాలా? కారు పార్టీ ఆ తరహా ప్లాన్ చేస్తుందని అనుకోవాలా? గతంలో కేటీఆర్, హరీష్‌రావు వంటి నేతలు ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని ఆ పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరిచేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో కీలక నేతల తర్వాత ఈ విధంగా మాట్లాడిన మొట్ట మొదటి ఎమ్మెల్యే ఆయనేనని అంటున్నారు.
ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తీరుపై బీఆర్ఎస్‌లో క్రమంగా విమర్శలు మొదలయ్యాయి. పార్టీలో పెద్దల మెప్పు పొందడానికి ఆయన ఈ తరహా కామెంట్స్ చేశారని ఓ వర్గం అంటోంది. ఆయన ఎంపీగా పని చేశారని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని అంటున్నారు. అయినా ఎప్పుడు, ఏం మాట్లాడాలో ఆయనకు తెలీదని అంటున్నవాళ్లు లేకపోలేదు. మొత్తానికి ఎమ్మెల్యే ‘కొత్త’ పలుకులు వింటుంటే వెనుక ఏదో జరగుతుందని నేతలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు
అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తామంటున్నారు
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు
— BIG TV Breaking News (@bigtvtelugu) April 15, 2025