Police Shot Autistic Boy| ఒక 17 ఏళ్ల టీనేజర్ కుర్రాడు ఒంటరి రోడ్డుపై కత్తి పట్టుకొని తిరుగుతుండగా.. అతడిని చూసిన పోలీసులు ప్రమాదం అని భావించి క్షణం కూడా ఆలోచించకుండా వరుసగా అతడిపై కాల్పులు జరిపారు. ఆ తరువాత అతడి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేశారు. కానీ 10 రోజుల పాలు ఆ యువకుడు కోమాలోనే ఉన్నాడు. పైగా అతని ఒక కాలు ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చింది. అలా కోమాలోనే ఉంటూ రెండు రోజుల క్రితం ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు పట్ల తీవ్ర వ్యతిరేకం వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఇడాహో రాష్ట్రం పోకాటెల్లో నగరంలో నివసించే విక్టర్ పెరెజ్ అనే 17 ఏళ్ల కుర్రాడు జన్మత: ఆటిజాం డిజార్డర్ తో బాధపడుతున్నాడు. అతనికి మతిస్థిమితం లేదు. మాటలు రావు. అయినా తన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉండే స్నేహితుల చెప్పేది అర్థం చేసుకోగలడు. అతనికి సెలెబ్రల్ పాల్సీ అనే వ్యాధి కూడా ఉంది. దీంతో అతను చాలా నెమ్మదిగా తడబడుతూ నడుస్తాడు. తల్లిదండ్రులు అతడిని చిన్నప్పటి నుంచే పట్టించుకోకపోతే అతడి పిన్ని ఆనా వాజ్‌క్వేజ్ పెంచుకుంటోంది. అతడు నివసించే ప్రాంతంలో యువకులందరూ అతడతో స్నేహంగా ఉంటారు. 17 ఏళ్లు వచ్చినా అతడు ఇంకా స్కూల్ పిల్లోడి లా వ్యవహరిస్తుంటాడు.
విక్టర్ డిఫరెంట్ గా ఉండడంతో అతను నివసించే చుట్టుపక్కల వారికంతా అతను తెలుసు. అందరూ అతడింతో స్నేహంగా పలకరిస్తారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5 2025న ఒక విషాదకర ఘటన జరిగింది. విక్టర్ తన ఇంటి బయట ఫెన్సింగ్ వద్ద ఆడుకుంటూ ఆ ఫెన్సింగ్ కట్ చేయాలని కత్తెరకు బదులు కత్తి తీసుకొని వచ్చాడు. అదంతా పొరిగింట్లో నివసించే అతని స్నేహితుడు దూరం నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలోనే అటువైపుగా వెళ్లే పోలీసుల పెట్రోలింగ్ కారు వచ్చింది.
ఆ కారులో ఉన్న నలుగురు పోలీసులు విక్టర్ ఫెన్సింగ్ అవతల ఉండి కత్తి పట్టుకొని అటు ఇటూ తిరుగుతున్నట్లు చూశారు. వెంటనే వారు దిగి అతడిని కత్తి కింద పడేసి లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ వారి మాటలు విక్టర్ కు అర్థం కాలేదు. దీంతో పోలీసులు ఏమాత్రం ఆలోచించకుండా విక్టర్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. అంతే ఆ కాల్పులకు విక్టర్ కుప్పకూలిపోయాడు.
Also Read: డ్రైనేజీలో మహిళ శవం.. ముక్కు పుడక ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు
ఇది చూసి దూరం నుంచి వీడియో రికార్డ్ చేసిన అతని స్నేహితుడు పరుగుల తీస్తూ అక్కడికి వచ్చాడు. విక్టర్ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి అతడి పిన్ని ఆనాకు సమాచారం అందించాడు. ఆనా వెంటనే ఆంబులెన్స్ కు కాల్ చేసి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. విక్టర్ ఇంకా బతికే ఉండగా.. డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేసి బుల్లెట్లు తొలగించారు. అతడి ఎడమ కాలి ఎముక బుల్లెట్ల కాల్పుల కారణంగా బాగా దెబ్బతినడంతో తొలగించాల్సి వచ్చింది. మరుసటి రోజు వరకు విక్టర్ స్పృహ లోకి రాకపోవడంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా.. కోమాలో ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతడిని లైఫ్ సపోర్ట్ పై పెట్టారు. విక్టర్ పరిస్థితి ఆపరేషన్ తరువాత కూడా విషమంగా ఉందని ఏ క్షణంలోనైనా మరణించవచ్చు నని వైద్యులు తెలిపారు.
మరోవైపు విక్టర్ పిన్ని ఆనా ఆ నలుగురు పోలీసుల పై కేసే నమోదు చేసింది. విక్షణా రహితంగా ఒక మతిస్థిమితం లేని (Autistic Boy) వ్యక్తిపై కాల్పులు చేయడమేంటని వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇంతలో రెండు రోజుల క్రితం విక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వార్త పొకటెల్లో నగరమంతా వ్యాపించింది. పోలీసుల తీర పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోకాటెల్లో నగరం మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. విక్టర్ మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఇది చాలా దురుదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ.. విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
తప్పుడు సమాచారం కారణంగానే ఇదంతా
విక్టర్ పై కాల్పులు జరిపిన పోలీసులకు ఆ ప్రాంతం నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఒక వ్యక్తి కత్తి చేతిలో పట్టుకొని మద్యం మత్తులో ఒక మహిళను హత్య చేసేందుకు వెంబడిస్తున్నాడని పోలీసులకు ఫోన్ వచ్చింది. అయితే విక్టర్ నివసించే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. విక్టర్ చేతిలో కత్తి చూసి అతడు తడబడుతూ నడుస్తుండడాన్ని గమనించారు. అతడే ఎవరినో హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని భావించారు. అందుకే వెంటనే 9 రౌండ్ల బుల్లెట్లు కురిపించారు. కానీ విక్టర్ పిన్ని ఆనా మాత్రం.. “పోలీసులు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.. అంత పెద్ద ఫెన్సింగ్ దూకి అతడు ఎవరిపై దాడి చేయగలడు. అతను సరిగా నడవలేడు. పైగా అతని చుట్టూ ఆ సమయంలో ఎవరూ లేరు. అలాంటిది కాల్చి చంపేయాలని పోలీసులు ఎలా నిర్ణయిస్తారు” అని ఆగ్రహంగా మీడియా ముందు ప్రశ్నించారు.