Sangareddy News: ఫెస్టివల్ సీజన్ వస్తే.. కొంతమంది నేతలు సేద తీరేందుకు ఇష్టపడతారు. ఆ సమయంలో రమ్మీ లేకుంటే పేకాట ఆటలు ఆడుతారు. ఒక్కోసారి అనుకోకుండా పోలీసులకు చిక్కుతారు కూడా. సంగారెడ్డి లోని కొల్లూరులో అదే జరిగింది. ఇంట్లో పేకాట స్థావరం ఏర్పాటు చేశాడు బీఆర్ఎస్‌కు చెందిన ఓ నేత. పోలీసుల దాడులతో బిత్తెరపోయాడు. చివరకు ఏడుగుర్ని అరెస్టు చేశారు. మరికొందరు తప్పించారా? తప్పుకున్నారా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ఇంట్లోనే పేకాట స్థావరం
దీపావళి సందర్భంగా కొందరు రాజకీయ నేతలు రకరకాల ఆటలు మొదలుపెడతారు. బయటవాళ్లు ఎవరైనా తమను చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయని భావిస్తుంటారు. సీక్రెట్‌గా తెలిసిన నేత ఇంట్లో పేకాట దందా మొదలుపెడతారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరుకి చెందిన స్థానిక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత అలాగే చేశాడు. దీపావళి సందర్భంగా తన ఇంట్లో పేకాట స్థావరం ఏర్పాటు చేశాడు. దీనికి పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
గేమ్ సీరియస్‌గా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్థానిక పోలీసుల సాయంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. దీంతో రాజకీయ నేతలు వ్యాపారులు ఒక్కసారిగా షాకయ్యారు. దాదాపు మూడున్నర లక్షల క్యాష్, పట్టుబడిన వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో బీఆర్ఎస్ నేతలు, వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.
పేకాట ఆడుతూ చిక్కిన బీఆర్ఎస్ నేతలు
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దాడిలో ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారు అయినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఆట జరుగుతున్న సమయంలో ఎలా తప్పించుకున్నారన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
కావాలనే పోలీసులు మరో నలుగుర్ని తప్పించారా? అనేదానిపై అనుమానాలు మొదలయ్యాయి. పట్టుబడిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంపై అనుమానాలు లేకపోలేదు. వివరాలు వెల్లడించాలని పైస్థాయి అధికారులను పోలీసులకు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది.
ALSO READ: నిరుద్యోగులకు బంపరాఫర్.. మెగా జాబ్ మేళా, ఇంకెందుకు ఆలస్యం
మొత్తం 11 మందిని మీడియా ముందు హాజరుపరుస్తారా? లేక పట్టుబడిన ఏడుగుర్ని మాత్రమే మీడియా ముందుకు ప్రవేశపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం తెలియగానే బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పట్టుబడినవారిలో వారి దగ్గర బంధువులున్నట్లు సమాచారం.