ఓజీ సినిమా విడుదలకు ముందే హంగ్రీ చీతా సాంగ్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. పవన్ అభిమానుల నుంచి మొదలు పెడితే చాలామంది ఈ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తమ ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల్లో కూడా కొంతమందికి ఆ ఇంట్రస్ట్ ఉంటుంది, కాదనలేం. అయితే నేరుగా ఎవరూ ఇలాంటి వీడియోలు చేసుకోరు. ఒకవేళ ఆ వీడియోలు చేయించుకోవాలనే ఆసక్తి ఉన్నా కూడా తమ పర్సనల్ అకౌంట్స్ లో వాటిని పబ్లిష్ చేసుకోరు. చోటామోటా నేతలు అయితే పర్లేదు కానీ, మంత్రులుగా పనిచేసిన వారు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తారని ఎవరూ అనుకోరు. కానీ కేటీఆర్ కి మాత్రం అలాంటి ఎలివేషన్లు కావాలనిపించాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో హంగ్రీ చీతా పాటకి కేటీఆర్ ఫొటోలను వాడి ఓ ఎలివేషన్ వీడియోని పోస్ట్ చేశారు.
ఎవ్వరికీ అందని వ్యూహం..
శత్రువుల పాలిట రామబాణం 🏹ఆట మొదలైంది 🔥
స్కాంగ్రెస్ కు ఇక చుక్కలే।
ఎవ్వరికీ అందదు అతని రేంజ్
రెప్పతెరిచేను రగిలే రివెంజ్
పవర్ అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్
ఫైర్ స్టోర్మ్ లాంటి రేజు 🔥Hungry Cheetah ft. @KTRBRS 🔥🔥 pic.twitter.com/lVf32HCyVy
— BRS Party (@BRSparty) September 20, 2025
అఫిషియల్ పేజ్ లో అరాచకం..
సహజంగా ఏదైనా ఫ్యాన్ పేజీలో ఇలాంటి వీడియోలు వస్తుంటాయి. కానీ నేరుగా బీఆర్ఎస్ పార్టీనే ఈ వీడియో అప్ లోడ్ చేసిందంటే దాని వెనక కేటీఆర్ ప్రోత్సాహం ఉందనే చెప్పుకోవాలి. ఎన్నికల్లో గెలవలేరు కానీ ఈ ఎలివేషన్లకేం తక్కువలేదంటూ నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు.
ఎవ్వరికీ అందని వ్యూహం..
శత్రువుల పాలిట రామబాణం
ఆట మొదలైంది.. అంటూ కేటీఆర్ కోసం రాసిన రైటప్ కూడా నవ్వులు పూయించడం విశేషం.
పనిలేదు, మాటలే..
కొంతమంది మాటలు తక్కువ పని ఎక్కువ. కానీ కేటీఆర్ పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టుగా ఉందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఓజీ సినిమాపై అభిమానం ఉండొచ్చు, గన్స్ అండ్ రోజెస్ పాటపై మరింత అభిమానం ఉండొచ్చు. ఉంటే మరీ ఇంతలా బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజ్ లో ఎలివేషన్లేంటి బాసూ అని కేటీఆర్ కి కౌంటర్లు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం, రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా పరాభవం తప్పేలా లేదు, కానీ కేటీఆర్ ఎలివేషన్లకేం తక్కువ లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. పేరుకి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధికారిక అకౌంట్లు అయినా వాటిలో కేవలం కేసీఆర్, కేటీఆర్ వార్తలే హైలైట్ అవుతుంటాయి. ఎక్కడ ఏ ప్రెస్ మీట్ జరిగినా, పార్టీ నేతల సమావేశం జరిగినా అక్కడ పాల్గొన్నవారికి ఏమాత్రం ప్రయారిటీ ఉండదు. కేటీఆర్ ని నాలుగైదు యాంగిల్స్ లో ఫొటోలు తీసి హైలైట్ చేయాలని చూస్తుంటారు. ఇలాంటి విపరీత పోకడల వల్లే బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలకు దూరమైంది. సామాన్యులకు దూరమై కేవలం నాయకుల ఎలివేషన్లకే పరిమితమైంది. ఓజీ పాటకు కేటీఆర్ ఫొటోలతో చేసిన ఎడిటింగ్ ఈ ఎలివేషన్ పిచ్చిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది.
సవాళ్లకే పరిమితమా?
దమ్ముంటే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి, ఉప ఎన్నికల్లో గెలవండి అంటూ కేటీఆర్ సవాళ్లు విసురుతున్నారు. జూబ్లీహిల్స్ లో ఎలాగూ ఉప ఎన్నిక వస్తుంది కదా, కనీసం ఆ ఎన్నికల్లో గెలిచి దమ్ము చూపించాలని కేటీఆర్ కి ప్రతి సవాళ్లు విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్ అని అనుకోవడం వల్లే ఈ పరిస్థితికి వచ్చారని, ఇకనైనా ఎలివేషన్లు ఆపి గ్రౌండ్ లెవల్ కి ఆలోచించాలని అంటున్నారు నెటిజన్లు. అటు పార్టీ కార్యకర్తలు కూడా ఇంకెంతకాలం ఈ వ్యక్తిపూజ అంటూ నసుగుతున్నారు. ఇప్పటికేనా కేటీఆర్ సోషల్ మీడియా భ్రమలలోనుంచి బయటపడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని, హితవు పలుకుతున్నారు.