Tribal Vote: స్వేచ్ఛ బ్యూరో: గిరిజన ఓటు బ్యాంకుపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి దూరమైన గిరిజన వర్గాలను తిరిగి చేరువ చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతుంది. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 17తో నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రిజర్వేషన్లతో గిరిజనులకు కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం..
గిరిజనులు నివసించే తండాలు, గూడేల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారితో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా.. నిరంతరం గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలపై పోరాడటం ద్వారా తిరిగి నమ్మకాన్ని పొందాలని బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 12 ఎస్టీ రిజర్వు నియోజకవర్గాల్లో గత(2023) ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
10% రిజర్వేషన్.. బీఆర్‌ఎస్ కొత్త అస్త్రం
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే పలుమార్లు, పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. 2022 సెప్టెంబరు 17న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతామని ప్రకటించారు. అనంతరం సెప్టెంబరు 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. అక్టోబరు 1 నుంచి విద్య, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. అప్పట్లో తీసుకున్న నిర్ణయం వల్ల గిరిజనులకు కలిగిన ప్రయోజనాలను వివరించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల పెంపుతో విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు లభించిన అవకాశాలను వివరించడంతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, గురుకులాలు, పోడు భూముల పట్టాల పంపిణీ వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన
గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి స్థానికులతో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. తండాలు, గూడేల్లో సభలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గత ప్రభుత్వ నిర్ణయాలను వివరించడంతోపాటు ప్రస్తుత సమస్యలను తెలుసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
కార్యక్రమాలపై చర్చలు..
గిరిజన ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిరిజన ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులతోఈనెల 12న సమావేశమయ్యారు. ఈనెల 17, అక్టోబర్ 30 తేదీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో గిరిజనుల సమస్యలను గుర్తించి వాటిపై పార్టీ తరఫున పోరాటాలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతోపాటు గిరిజన నాయకత్వాన్ని మరింత క్రియాశీలం చేయడంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తండాల్లో గులాబీ జెండా
గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల నుంచి బీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో వచ్చే ఎన్నికలకు ముందే ఆ వర్గాల్లో పార్టీపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గిరిజనుల సమస్యలు, సంక్షేమం, రిజర్వేషన్లు, తండాల అభివృద్ధి వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను రూపొంస్తున్నట్లు సమాచారం.ప్రస్తుత ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఎదురవుతున్న సమస్యలను ఎత్తిచూపడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?