HCU Accident : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలోని ఓ భవనం కుప్పకూలింది. శనివారం సాయంత్రం యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్మినిస్ట్రేషన్ బిల్లింగ్ కూలిపోవడంతో.. శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రెవిన్యూ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద కార్మికులు ఉన్నారని అనుమానాలు మధ్య గాలింపు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తున్నారు.
భవన పనుల్లో మొత్తంగా 25 మంది కార్మికులు పాల్గొన్నట్లుగా తెలుస్తుండగా.. వారిలో ఇద్దరు కనిపించడం లేదని కార్మికులు చెబుతున్నారు. దాంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్కూ సిబ్బంది, పోలీసులు వేగంగా శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఈ గాలింపులో ఓ కార్మికుడిని కూలిన భవన శిథిలాల కింద గుర్తించారు. అతన్ని.. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గుర్తించిన కార్మికుడికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అతను భవనం కూలిన చోటే ఉండడంతో మరో వ్యక్తి సైతం అక్కడే ఉండే అవకాశాలున్నాయని వెతుకులాట సాగిస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూతన భవన నిర్మాణాలు చేపట్టారు. అందులో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఒకటి. దీని నిర్మాణ పనుల్ని కాంట్రాక్టర్ కి అప్పగించగా.. ఫిబ్రవరి 27న గురువారం నాడే బిల్డింగ్ కి స్లాబ్ పనులు పూర్తి చేశారు. ఈ పనుల కోసమే 25 మంది కార్మికులు పనుల్లో ఉన్నారు. కాగా.. భవనం కూలిన సమయానికి పనులు పూర్తి అవ్వడంతో.. మిగతా కార్మికులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో.. పెను ప్రమాదం తప్పిందంటున్నారు. లేదంటే..మరింత మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకునే వాళ్లే అంటున్నారు.
సాధారణంగా నిర్మాణ పనులు సాయంత్రం 5.30 – 6.0 గంటల వరకు అయిపోతాయి. కానీ.. స్లాబ్ వేసే పనులుండడంతో రాత్రి 8 గంటల వరకు కార్మికులంతా పనుల్లోనే ఉండిపోయారు. అయితే.. అంతా వెళ్లిపోయిన తర్వాత భవనం దగ్గర కొన్ని వస్తువులు మర్చిపోయారని ఇద్దరు వెళ్లినట్లు సహచర కార్మికులు చెబుతున్నారు. ఆ సమయంలో స్లాబ్ కింద ఉన్న సపోర్టులు కూలిపోవడంతో.. కాంక్రీట్ సహా మొత్తం కింద పడిపోయాయి. ఈ ప్రమాదం రాత్రి 8.30 గంటల వరకు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఓ కార్మికుడు చిక్కుకున్నాడనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తుండగా.. అతని కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. సహాయక బృందాలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కార్మికుడి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.