హాయ్.. నా పేరు రాజు. హైదరాబాద్‌లో చదువుతున్నా. ఎక్కడ ఉంటున్నానో.. ఎక్కడ చదువుతున్నానో చెప్పను. ఎందుకంటే.. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మా వాళ్లు అందరికీ తెలుసు. కానీ, ఈ విషయాన్ని షేర్ చేసుకోడానికి కారణం… నేను ఉన్న ఇప్పటి పరిస్థితి గురించి అవగాహన తెచ్చుకోడానికి. ఇలా నాకే జరుగుతోందా? లేకపోతే నా వయస్సులో ఉన్న కుర్రాళ్లు అందరికీ ఇలాగే ఉంటుందా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నా. అందుకే, ఈ లేఖ.
అన్నట్లు నా వయస్సు 21 ఏళ్లు. మేం ఉంటున్న అపార్టుమెంట్లోనే ఎదురింటి ఫ్లాట్.. (మా ఎదురింటికి పక్క ఫ్లాట్)లో ఓ జంట ఉంటున్నారు. వాళ్లు చాలా హ్యాపీ కపుల్స్. ఆమె పేరు రమ్య (పేరు మార్చాం) అని తెలుసుకున్నా. నా కంటే పదేళ్లు పెద్దదే. కానీ, నాకు ఆంటీ అని పిలవాలి అనిపించలేదు. ఎందుకంటే.. ఆమె చూసేందుకు టీనేజ్ అమ్మాయిలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. మా అమ్మకు ఆమె బెస్ట్ బడ్డీ. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. అలా నాకు కూడా పరిచయం అయ్యింది.
అదేంటో ఆమె మాట్లాడుతుంటే అలా వింటూ ఉండిపోతాను. ఇంటి బెల్లు మోగినప్పుడల్లా రమ్య వస్తే బాగున్ను అనే ఫీలింగ్. నిజం చెబుతున్నా ఫ్రెండ్స్.. ఆమె మా ఇంటికి వస్తాది.. చూద్దామని కాలేజ్‌కు కూడా వెళ్లేవాడిని కాదు. ఫ్రెండ్స్ పిలిచినా వెళ్లేవాడిని కాదు. అంతగా అడిక్ట్ అయిపోయాను. అది ఏం ఫీలింగో నాకు తెలీదు. ఆమెకు పెళ్లయ్యిందని తెలుసు. అయితే, పిల్లలు లేరు. అందుకే మా అమ్మ ఎప్పుడూ.. ఏంటీ ప్లాన్ చెయ్యడం లేదా అని అడుగుతుంది. కానీ, ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా ఆమె ముఖంలో రంగులు మారిపోయేవి. సాధారణంగా అలాంటి ప్రశ్నకు అమ్మాయిలు సిగ్గుపడాలి. కానీ, ఆమెలో ఆవేదన కనిపించేది. వెంటనే టాపిక్ మార్చేసేది. బహుశా నా ఎదురుగా చెప్పడం ఇష్టం లేకో.. మరే కారణమో తెలీదు.
ఓ రోజు అమ్మ, నాన్న రాజమండ్రి వెళ్లారు. నేను మాత్రమే ఇంట్లో ఉన్నాను. అప్పుడు నా గుండె వేగం పెరిగింది. ఎందుకంటే.. కాలింగ్ బెల్‌కు నాకు ఉన్న అనుబంధం అలాంటిది. గుండెలో ఏదో అలజడి.. రమ్య వచ్చి ఉంటుంది.. ఇంట్లోకి పిలిచి మాట్లాడాలా? లేదా గుమ్మం బయటే ఉంచి.. అమ్మ లేదు ఊరెళ్లారు అని చెప్పాలా? లోపలికి వస్తే ఏం మాట్లాడాలి… ఇలా నాలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తరహాలో ప్రశ్నలే ప్రశ్నలు. మొత్తానికి నేను సక్సెస్‌ఫుల్‌గా తలుపు తెరిచా. అనుకున్నట్లుగానే ఎదురుగా రమ్య.
రమ్యను గుమ్మంలో చూసి నా నోట మాట రాలేదు. అబ్బా.. ఆమె స్మైల్.. ‘‘గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నట్లు ఉంది’’ అనే నాగార్జున డైలాగ్‌కు అర్థం తెలిసిన సందర్భం అది. ఎప్పుడూ లేనిది ఆమె ఆరోజు చీర కట్టింది. పెర్‌ఫ్యూమ్ స్మెల్ నా మైండ్ బ్లాక్ చేసింది. అందుకే కాబోలు మాట బయటకు రాలేదు. అమ్మ ఊరెళ్లింది అని చెప్పే లోపే.. ఆమె నా చేతిలో హాట్ ప్యాక్ పెట్టింది. ఆ వెంటనే ‘‘మా ఇంటిలో వ్రతం చేసుకున్నాం. ఇందులో పులిహోర ఉంది. అమ్మ ఊరెళ్తున్నట్లు నిన్న చెప్పారు. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారని చెప్పారు. ఏమైనా చేసుకున్నారో లేదో అని మీకు కూడా వండేశాను. తీసుకో రాజు’’ అని అంది. ఆమె నోటి నుంచి నా పేరు వినడం అదే ఫస్ట్ టైమ్. ఇంకేముంది.. ఆ రోజు నిద్రపడితే ఒట్టు.
అలా ఆమె రెండు రోజులు నాకు ఫుడ్ పెట్టారు. ఉత్తినే తినేస్తే ఏం అనుకుంటారో అనుకున్నా. ఓరోజు కొన్ని ఫ్రూట్స్ కొని ఇచ్చాను. రమ్య చాలా మోహమాట పడ్డారు. మీ అమ్మ రాని చెబుతా. నేను ఏమైనా ఇస్తే తిరిగి ఇచ్చేస్తారు కదూ అంటే చిలిపిగా నవ్వి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. ఆమెతో నాకు పరిచయం పెరిగింది. ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ చాట్ మొదలుపెట్టా. అప్పుడే.. అర్థమైంది. నేను ఆమెతో ప్రేమలో ఉన్నానని. కానీ, ఆమె నేను కేవలం ఆమె స్మైల్‌కే దాసోహం. అంతకు మించి వేరే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వాట్సాప్ చాట్‌లో కూడా ఓన్లీ గుడ్ నైట్ లేదా గుడ్ మార్నింగ్ మెసేజ్‌లే.
ఓ రోజు రాత్రి…
ఓ రోజు రమ్య షాపింగ్‌కు వెళ్లింది. ఆ విషయం నాకు తెలీదు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో నాకు కాల్ వచ్చింది. రాజు ఎక్కడ ఉన్నావ్.. నేను షాపింగ్‌కు వచ్చాను. టైమ్ తెలియలేదు. నాకు ఆటోలో ఒంటరిగా రావాలంటే భయంగా ఉంది. ఉబెర్, ఓలా బుక్ చెయ్యడం రాదు అని చెప్పింది. వెంటనే నేను పుసుక్కున మీ ఆయన లేడా అనేశా. ఆమె ఏమనుకుందో ఏమో. సరే.. ఫోన్ పెట్టేస్తున్నా అని అంది. అరే తప్పు చేశానే.. అని నేనే తిరిగి కాల్ చేసి ఎక్కడ ఉన్నారో చెప్పండి వస్తున్నా అన్నాను. అడ్రస్ చెప్పింది.
అక్కడికి వెళ్లి నెమ్మదిగా నడుస్తూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. ఆ రోజు ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే ఒక విషయం నాకు తెలిసింది. వారిద్దరికీ కొన్ని రోజులు నుంచి మాటలు లేవని. దానికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ, ఒక్క విషయం అర్థమైంది. ఆమెకు నేను అంటే చాలా ఇష్టమని. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా.. ఫస్ట్ అనుభవం ఉందా ఇలా చాలా ప్రశ్నలే వేసింది. ఆ సమయంలో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మైండ్‌లో ఏవో రసాయనాలు రిలీజ్ అవుతున్న అనుభవం. ఎందుకంటే.. ఒక అమ్మాయితో అలాంటి విషయాలు మాట్లాడటం అదే ఫస్ట్ టైమ్.
అలా రోజులు గడిచాయి. ఆమెతో నేను హెల్తీ ఫ్రెండ్ షిప్‌నే కొనసాగించా. కానీ ఒక రోజు.. అమ్మకు తెలిసిపోయింది. ఇద్దరూ క్లోజ్‌గా ఉంటున్నామని ఎవరో ఆంటీ చెప్పారట. అమ్మ అడిగేసింది. ఆమెను ఇంటికి కూడా రావద్దని చెప్పేసింది. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఆమె నచ్చింది పెళ్లి చేసుకుంటా అని చెప్పా. ఆ తర్వాత రోజు డెంటిస్టు దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే.. అమ్మ, నాన్న ఆ స్థాయిలో కుమ్మేశారు. దవడలు వాచిపోయాయి. ఇదే విషయాన్ని నేను రమ్యను కూడా అడిగా. ‘‘నీ భర్తను వదిలేయ్ పెళ్లి చేసుకుందాం’’ అన్నాను.
కానీ, ఆమె సున్నితంగా రిజక్ట్ చేసింది. ‘‘వద్దు.. రాజు. నీకు అలాంటి ఉద్దేశాలు ఉంటే మానేయ్. మీ అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నాతో మాట్లాడటం లేదు. నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వు మంచోడివి. నీకు మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. నా భర్త విడాకులు అప్లై చేశాడు. మన మధ్య ఏదో ఉందని మా అమ్మనాన్నలకు చెప్పాడు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఎలాగో విడాకులు తీసుకుంటున్నావు కదా. నాతో ఉండిపో అనే ధైర్యం చేయలేకపోయా. ఎందుకంటే.. అప్పటికి మనకు ఉద్యోగం సద్యోగం లేదు. నా పేరెంట్స్ దవడ పళ్లు రాళ్లగొట్టడానికి ఉన్న ప్రధాన కారణాల్లో అది కూడా ఒకటి.
ఆ తర్వాతి రోజు నుంచి ఆమె మళ్లీ కనిపించలేదు. ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేది కాదు. నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసిందో ఏమిటో మెసేజ్‌లు, కాల్స్ వెళ్లేవి కావు. వేరే నెంబర్‌తో కూడా ట్రై చేశా. కానీ వర్కవుట్ కాలేదు. దీంతో నేను ఓ పిల్లాడితో ఆ ఇంటి తలుపు తట్టించి రమ్య ఇంట్లో ఉందో లేదో తెలుసుకున్నా. షాకింగ్.. ఆమె ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్లిందని నేను తన భర్తను అడగలేను. ఒక వేళ అడిగితే మా మధ్య సంబంధం నిజమే అనుకుంటాడు. ఆమె అమ్మగారి ఇల్లు ఎక్కడ అనేది కూడా నాకు తెలీదు. కనీసం ఆమె ఇంటి పేరు కూడా ఏ రోజు అడగలేదు.. సోషల్ మీడియాలో సెర్చ్ చేద్దామంటే.
Also Read: పెళ్లి చేసుకుంటున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూడండి, లేకపోతే…
అప్పటి నుంచి నేను దేవదాసులా మారిపోయా. ఆ తర్వాత స్నేహితుల దయ వల్ల కోలుకున్నా అనుకోండి. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. ఇప్పటికీ ఆమె ఆచూకీ తెలియలేదు. ఒక వేళ తెలిసినా.. కలిసే ధైర్యం లేదు. మూవ్ అన్ అయిపోతున్నా. ఆమె రాత్రి నన్ను తోడు కోసం పిలిచి ఉండకపోతే.. బాగుండేదేమో. తన గురించి తలచుకున్నాప్పుడల్లా.. నా గుండె ఇంకా భారంగానే ఉంటుంది. పాపాలే కాదు.. కొన్ని అనుభవాలు కూడా బయటకు చెప్పుకుంటూ గుండె తేలికవుతుంది. అందుకే మీతో షేర్ చేసుకున్నా.
(నోట్: ఓ రీడర్ మాకు పంపిన లేఖను యథావిధిగా ఇక్కడ అందించాం. వారి ప్రైవేసీ కోసం పేర్లను మార్చాం. గమనించగలరు.)